9 వసంతాలలో అత్యంత ప్రగతి శీల రాష్ట్రంగా తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది…. ఎమ్మెల్సీ, రైతు బంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి

ప్రచురణార్థం

9 వసంతాలలో అత్యంత ప్రగతి శీల రాష్ట్రంగా తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది…. ఎమ్మెల్సీ, రైతు బంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి

*మానవీయ దృక్పథం, నిర్మాణాత్మకమైన ఆలోచనతో పారదర్శకంగా ప్రభుత్వ పాలన

*ప్రతి అంశంలో  రైతన్నకు కొండంత అండ సీఎం కేసిఆర్

*961 కోట్ల నిధులు నేరుగా రైతుబంధు పెట్టుబడి సహాయం కింద రైతుల ఖాతాల్లో జమ

*93 కోట్లతో చెరువుల పునరుద్ధరణ, 24 కోట్లతో చెక్ డ్యామ్ ల నిర్మాణం

*ఆసరా ఫించన్ల కింద 865.56 కొట్ల లబ్ధిదారుల అందజేత

*బడుగు బలహీనవర్గాల అభివృద్ధికి పటిష్ఠ కార్యచరణ అమలు

*కులవృత్తుల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి చర్యలు

*పేదింటి ఆడపిండ్ల పెళ్లి సహయం కింద 105.36 కొట్ల పంపిణీ

*100 ఎంబీబీఎస్ సీట్లతో వైద్య కళాశాల ప్రారంభానికి సిద్దం

*గ్రామాల స్వరూపం మార్చేసిన పల్లె ప్రగతి, కేంద్రంలో వరాల పంట

*ప్రజలు చేరువలో పాలన, పారిశ్రామిక ప్రగతితో యువతికి ఉపాథి, పటిష్ట శాంతిభద్రతలు

*రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో అవతరణ దినోత్సవ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్సీ రైతు బంధు సమితి అధ్యక్షులు
———————————————-
జయశంకర్ భూపాలపల్లి, జూన్ -02:
———————————————
దశాబ్దాల పోరాట ఫలితంగా సాధించిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం 9 వసంతాలు పూర్తి చేసుకునే సమయానికి అన్ని రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు.

శుక్రవారం రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో ముఖ్యఅతిథిగా పాల్గొనేందుకు జిల్లాకు వచ్చిన ఎమ్మెల్సీ రైతు బంధు సమితి అధ్యక్షులు భూపాలపల్లి సెంటర్ లో అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి అంబేడ్కర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన వేడుకలలో పాల్గొన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథి గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకం ఆవిష్కరించారు.

అనంతరం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాలో వివిధ శాఖల ద్వారా జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ తన సందేశం అందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీళ్లు నిధులు నియామకాల కే తెలంగాణ ప్రత్యేక సాధన పోరాటం జరిగిందని, దశాబ్దాల పాటు తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరిగిన వీరోచిత పోరాట ఫలితంగా 2 జూన్ 2014న రాష్ట్రం ఆవిర్భవించిందని అన్నారు.

నూతన రాష్ట్రంలో ఉద్యమ నాయకుడే ప్రభుత్వ పాలన చేస్తూ తెలంగాణ  రాష్ట్రాన్ని గత 9 సంవత్సరాలుగా అభివృద్దిలో అగ్రగామిగా, దేశానికి ఆదర్శంగా నిలిపారని ఆయన పేర్కొన్నారు.

మానవీయ దృక్పథం, నిర్మాణాత్మకమైన ఆలోచనతో పారదర్శకంగా ప్రభుత్వ పాలన కొనసాగుతుందని, ఇట్లాంటి చారిత్రక సందర్భంలో రాష్ట్ర దశాబ్ద ఉత్సవాలను 21 రోజులపాటు జూన్ రెండు నుంచి జూన్ 22 వరకు ప్రభుత్వం పండగ వాతావరణం లో ఘనంగా వైభవోపేతంగా నిర్వహిస్తుందని అన్నారు.

రైతుకు ప్రతి దశలో కొండంత అండగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

సంక్షోభంలో కూరుకొని అల్లాడిన తెలంగాణ వ్యవసాయానికి  తిరిగి  జవజీవాలను అందించడంలోనూ,నిరాశ నిస్పృహలతో కొట్టువిుట్టాడే రైతులలో తిరిగి ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని  నింపడంలో ప్రభుత్వం సఫలీకృతమైందని, నాట్ల దగ్గర నుంచి పంట కోతలు వరకు సహకారం అందిస్తూ, రైతు పండిన ప్రతి గింజ కొనుగోలు చేస్తూ   రైతన్నకు కొండంత అండగా సీఎం కేసిఆర్ నిలుస్తున్నారని అన్నారు.

దేశంలో ఎక్కడ లేని విధంగా  సీఎం కేసిఆర్  రైతు బంధు,  రైతు భీమా,  వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్,   చెరువుల పునరుద్దరణ,   పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, భారీ  ప్రాజేక్టు నిర్మాణం, సకాలంలో  ఎరువులు, విత్తనాల పంపిణీ, వంటి అనేక అద్బుతమైన  పథకాలను సంస్కరణలను అమలులోకి తీసుకొని వచ్చారని, జిల్లాలొని 1, 08 ,197 మంది రైతులకు  961 కోట్ల రైతు బంధు, 93,550 మంది రైతులకు 71.5 కోట్లు రుణమాఫీ, ప్రమాదవశాత్తు మరణించిన 1405 రైతు కుటుంబాలకు 70.25 కోట్ల రైతు బీమా సహాయాన్ని అందించామని అన్నారు.

జిల్లాలోని 6598 మంది రైతులకు 113 కోట్ల 60 లక్షలతో వ్యవసాయ యాంత్రీకరణ, 12 కోట్ల ఖర్చుతో 17 వేల 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన 5 గోడౌన్ లు, 4686 మంది రైతులకు 36.06 కోట్లతో బిందు తుంపరి సేద్యం సాగు ప్రోత్సాహకాలు అందించామని అన్నారు.
జిల్లాలో 93 కోట్ల 35లక్షలతో 315 చెరువుల పునరుద్ధరణ, 24.44 కోట్లతో చెక్ డ్యామ్ ల నిర్మాణం, 14.5 కోట్లతో రామప్ప ఫీడర్ ఛానల్ , కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, జిల్లాలో సాగు విస్తిర్ణం పెరిగిందని అన్నారు.

గతంలో కరెంటు లేక కష్టాలు పడిన రైతన్నలకు తెలంగాణ ప్రభుత్వం జిల్లాలో 59,051 వ్యవసాయ కనెక్షన్లకు 24 గంటల ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తున్నామని అన్నారు.

*సంబండ వర్గాల సంక్షేమంలో దేశానికే ఆదర్శం

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో సంపద పెంచడం పెరిగిన సంపాదన పేదల సంక్షేమానికి ఉపయోగించే దిశగా దేశానికే సంబంధం వర్గాల సంక్షేమంలో తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు.

జయశంకర్  భూపాలపల్లి జిల్లాలో ఆసరా ఫించన్ల కింద 58,170 మందికి ప్రతి నెలా గతంలో వచ్చే 200 నుంచి 2016/- కు, 500/- నుంచి 3016/- కు పెంచి మొత్తం 865.56 కొట్ల పంపిణి చేసామని అన్నారు. కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ కింద జిల్లాలో ఉన్న 11,025 మంది ఆడపిల్లల పెండ్లిన్లకు ప్రభుత్వ సహాయం కింద
105 కొట్ల 36 లక్షల సహాయం చేసామని, 7,196 మంది గర్భిణీ స్త్రీలకు కేసీఆర్ కిట్లు అందించామని అన్నారు.

*బడుగుబలహీన వర్గాల అభ్యున్నతికి కృషి

రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ బడుగు బలహీన వర్గాలకు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేశారని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రత్యేకంగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారని, జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల కోసం 22 రెసిడెన్షియల్ పాఠశాలలు కళాశాలలు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి విద్యార్థి పై లక్షకు పైగా నిధులు ఖర్చు చేస్తూ పౌష్టికాహారం తో పాటు నాణ్యమైన విద్య అందిస్తున్నామని అన్నారు.

స్వయం ఉపాధి కింద జిల్లాలో 2828 మంది లబ్ధిదారులకు సబ్సిడీ కింద 22 కోట్ల 73 లక్షలు విడుదల చేశామని, 151 మంది దళితులకు దళిత బంధు కింద 10 లక్షలు అందించామని, 212 మంది దళితులకు 26 కోట్ల ఖర్చు చేసి 491 ఎకరాల 17 గుంటల వ్యవసాయ భూమి పంపిణీ చేశామని తెలిపారు.

కార్మిక శాఖ పరిధిలో 3025 మంది రైతులకు 16 కోట్ల 50 లక్షల పైగా నిధులను సంక్షేమ కార్యక్రమాల కింద అందించాం.

*కులవృత్తులకు ప్రోత్సాహంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం

కులవృత్తులను ప్రోత్సహించడంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం ప్రతి కార్యాచరణ అమలు చేసిందని పేర్కొన్నారు.

జిల్లాలో 127 కోట్లతో కురుమ యాదవ సోదరులకు 6,772 గొర్రెల యూనిట్లు పంపిణీ చేశామని, రెండవ విడతలో 6043 లబ్ధిదారులకు గొర్రెల యూనిట్ల పంపిణీ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

జిల్లాలో 836 నీటి వండ్రులలో 7 కోట్ల 56 లక్షలతో చేపపిల్ల లను, 1.91 కోట్లతో రొయ్య పిల్లలను ఉచితంగా పంపిణీ చేశామని తెలిపారు. రైతుల తరహాలో నేత కార్మికులకు గీత కార్మికులకు ప్రత్యేక బీమా పథకాన్ని అమలు చర్యలు తీసుకుంటున్నామని, ప్రమాదాలకు గురైన 89 గీత కార్మికుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం అందించమని, గీత కార్మికులకు చెట్ల పన్ను రద్దు చేశామని తెలిపారు. దళితులకు గిరిజనులకు గీత కార్మికులకు ప్రభుత్వం అందించే వైన్ షాపులలో రిజర్వేషన్ కల్పించామని అన్నారు.

*వైద్య, విద్యా రంగాల్లో సమూలమైన మార్పులు

గతంలో ప్రభుత్వం వైద్య , విద్యా వ్యవస్థల పై ఉన్న అపనమ్మకాలను పూర్తిగా తొలగించి ప్రజలలో విశ్వాసం కలిగే విధంగా పటిష్ట చర్యలు తీసుకున్నామని అన్నారు. జిల్లాలో 22.98 కోట్లతో 149 ప్రభుత్వ పాఠశాలల్లో మన ఊరు మనబడి కార్యక్రమం కింద మౌలిక వసతులు కల్పించే ప్రైవేటుకు దీటుగా తీర్చిదిద్దామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన ప్రారంభించామని, 10వ తరగతి ఫలితాలలో ప్రైవేటుకు దీటుగా మెరుగైన ఫలితాలు సాధిస్తున్నామని తెలిపారు.

జిల్లాలో వైద్యరంగంలో విప్లవాత్కమైన మార్పులు సాధించామని, 100 ఎంబీబీఎస్ సీట్లతో ఈ సంవత్సరం వైద్య కళాశాల దానికి సిద్ధమైందని, కంటి వెలుగు కింద 2.08 లక్షల మందికి పరీక్షలు 56,607 కళ్లద్దాలు పంపిణీ చేశామని, 134 రకాల పరీక్షలు చేసే డయాగ్నస్టిక్ హబ్ ను 2 కోట్లతో ఏర్పాటు చేశామని, జిల్లాలో 100 పడకల ఆసుపత్రిని 350 పడకల ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చేశామని,9 కోట్ల 90 లక్షల వ్యయంతో ఐదు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 44 ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల నూతన భవనాలు వేగవంతంగా పూర్తి చేస్తున్నామని, 3428 మంది గర్భిణీ స్త్రీలకు న్యూట్రిషన్ కిట్ పంపిణీ చేశామని, మహాదేవపూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో డయాలసిస్ సెంటర్ మంజూరు అయిందని అన్నారు.

చిట్యాల మహాదేవపూర్ కమిటీ హెల్త్ సెంటర్లలో, జిల్లా ఆసుపత్రి కేంద్రంలో బ్లడ్ బ్యాంకులు ఏర్పాటు చేశామని, 3 కోట్ల 60 లక్షలతో సి ఎం ఎస్ నిర్మాణం చేపట్టామని తెలిపారు.

*పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి తో మారిన స్వరూపం

పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాలతో జిల్లాలో గ్రామాలు పట్టణాల స్వరూపం మారిపోయిందని, పారిశుధ్యం పచ్చదనం స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు.

పల్లె ప్రగతి కార్యక్రమం కింద గ్రామీణ ప్రాంతాలలో 121 కోట్లకు పైగా ఖర్చు చేసి ప్రతి గ్రామపంచాయతీలో ట్యాంకర్ ట్రాక్టర్ స్మశాన వాటిక డంపింగ్ యార్డ్, నర్సరీ ,కంపోస్ట్ షెడ్డు, తెలంగాణ క్రీడా ప్రాంగణాలు , పల్లె ప్రకృతి వనాలు ఇటువంటి సదుపాయాలు కల్పించామని అన్నారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షల మేరకు భూపాలపల్లి మున్సిపాలిటీలను నూతనంగా ఏర్పాటు చేశామని తెలిపారు. పట్టణ ప్రగతి కార్యక్రమం కింద 32 కోట్ల 44 లక్షలతో 252 సిసి రోడ్లు డ్రైనేజ్ నిర్మాణ పనులు పూర్తి చేశామని, 40 లక్షల 8 ఓపెన్ జిమ్ , 3.5 కోట్లతో స్మశానవాటికలు, కోటి రూపాయల డంపింగ్ యార్డ్, 70 కోట్లతో మిషన్ భగీరథ కింద ఇంటింటికి నల్ల ద్వారా త్రాగునీరు పనులు పూర్తి చేశామని తెలిపారు. పారిశుధ్యం పచ్చదనం మౌలిక సదుపాయాల కల్పనకు పటిష్ట చర్యలు తీసుకున్నామని అన్నారు.

ప్రతి మున్సిపాలిటీలో సమీకృత నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని, ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేశామని, పారిశుధ్య నిర్వహణ కోసం స్వచ్ఛ ఆటో ట్రాలీల కొనుగోలు, నూతనంగా అభివృద్ధి పనులు పూర్తి చేసామని తెలిపారు.

*మౌలిక వసతుల కల్పన, అభివృద్ధిలో ముందంజ

ప్రజలకు కనీస మౌలిక వస్తువులు కల్పించడం, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడంలో జిల్లా ముందు వరుసలో ఉందని అన్నారు.

జిల్లాలో అన్ని వర్గాల వారికి 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసేందుకు 23 కోట్ల 77 లక్షలతో ఆదనంగా ఒకటి 132 కెవి, పద్నాలుగు 33/11 కేవి సబ్ స్టేషన్ లో నిర్మాణం పూర్తి చేసామని తెలిపారు. పరిశ్రమలకు పవర్ హాలిడేలు లేకుండా నాణ్యమైన కరెంటు సరఫరా చేయడం వల్ల మూడు షిఫ్టులలో కార్మికులకు ఉపాధి లభిస్తుందని తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల్లో 154 కోట్లను ఖర్చు చేసి 424 ఆవాసాలలో త్రాగునీటి సరఫరా స్టెబిలైజేషన్ చేశామని తెలిపారు. జిల్లాలో పేద ప్రజలు ఆత్మగౌరవంతో జీవించేందుకు 95 కోట్ల 32 లక్షల వ్యయంతో 1003 డబుల్ బెడ్ రూమ్ ఇంటి నిర్మాణం పూర్తి చేశామని మరో 515 ఇండ్లు చివరి దశకు వచ్చాయని, పారదర్శకంగా లాటరీ విధానం ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరిగిందని త్వరలో ఇండ్లు అందిస్తామని అన్నారు.

గ్రామీణ ప్రాంతంలో పంచాయతీరాజ్ శాఖ కింద 138 కోట్ల 52 లక్షలు ఖర్చు చేసి 68 రోడ్డు నిర్మాణ పనులు, 49 కోట్ల వ్యయంతో 65 బీటీ రోడ్ల మరమత్ పనులు, 93 కోట్లతో 13 వంతెనలను, 3 కోట్లతో మూడు నూతన మండల ప్రజాపరిషత్ భవనాలను, 101 కోట్ల 40 లక్షలతో 1148 అంతర్గత సిసి రోడ్లను, 93 కోట్ల 80 లక్షల డి.ఎం.ఎఫ్.టి నిధులతో 447 పనులను, ఉపాధి హామీ కింద 12 కోట్ల 60 లక్షలతో 63 గ్రామపంచాయతీ భవనాలను, 12 కోట్ల 60 లక్షలతో 188 స్మశాన వాటిక లను, 9 కోట్ల 90 లక్షలతో రైతు వేదికలను నిర్మించడం జరిగింది. కాలేశ్వర దేవస్థానంలో ప్రత్యేకంగా పంచాయతీరాజ్ శాఖ ద్వారా 19 కోట్ల 30 లక్షల విలువచేసే పదిహేను అభివృద్ధి పనులను పూర్తి చేయడం జరిగింది.

*పటిష్ట శాంతి భద్రతలు, పారిశ్రామిక వృద్ధి తో యువతకు ఉపాధి

తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయంలో శాంతి భద్రతలో పట్ల అనేక సందేహాలు అపోహలు ఉన్నాయని, వాటిని పటాపంచలు చేస్తూ పటిష్టంగా శాంతి భద్రతలను నిర్వహిస్తున్నామని అన్నారు.

మహిళల కోసం ప్రత్యేకంగా చీటీలు ఏర్పాటు చేశామని, పోలీసు నియామకాలు మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించామని, పోలీసులకు ప్రత్యేకంగా వాహనాలు అందించామని, ప్రతి పోలీస్ స్టేషన్ నిర్వహణకు గతంలో లేనివిధంగా నిధులు కేటాయించామని, దేశంలోనే ప్రధమంగా ట్రాఫిక్ పోలీస్ కు 40% రిస్క్ అలో వెన్స్ అందిస్తున్నామని తెలిపారు.

జిల్లాలో నూతనంగా టేకుమట్ల మొగులపల్లి పోలీస్ స్టేషన్లను 2.5 కోట్ల చోప్పున 5 కోట్లతో ఏర్పాటు చేశామని 37 ఎకరాల స్థలంలో జిల్లా పోలీస్ కార్యాలయ నిర్మాణానికి ప్రభుత్వం 25 కోట్లను మంజూరు చేసిందని, ఎస్పీ క్యాంపు కార్యాలయం నివాసగృహం నిర్మించేందుకు మరో 10 కోట్లను అందించిందని, జిల్లా పోలీస్ యంత్రాంగానికి పెట్రోలింగ్ నిమిత్తం 162 వాహనాలు అందించామని తెలిపారు.

పటిష్టంగా శాంతిభద్రతలు, సులభతర అనుమతులు అందించేందుకు అద్భుతమైన టీఎస్ ఐపాస్ పాలసీ కారణంగా జిల్లాలో 76.8 కోట్ల పెట్టుబడితో 141 పరిశ్రమలు ఏర్పాటు చేసి 1128 మంది యువతకు ఉపాధి అవకాశం కలిగించామని, టీ పె ఐడియా కింద 564 ఎస్సీ ఎస్టీ మైనారిటీ పారిశ్రామికవేత్తలకు 26 కోట్ల 49 లక్షల సబ్సిడీ విడుదల చేశామని తెలిపారు.

వ్యవసాయం, సాగునీరు ,సంక్షేమం, గ్రామీణ అభివృద్ధి, పట్టణ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, పచ్చదనం పెంపు, పారిశ్రామిక అభివృద్ధి ఉపాధి కల్పన శాంతిభద్రతలు ఆస్తుల సృష్టి మొదలగు అన్ని రంగాలలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొమ్మిది సంవత్సరాల స్వల్ప కాలంలో అద్భుతమైన పురోగతి సాధించి దేశానికి ఆదర్శంగా నిలిచిందని, అనేక ఉద్యమాలు నిర్వహించుకుని దశాబ్దాల పోరాట ఫలితంగా సాధించిన తెలంగాణ ప్రగతిని విజయాలను ఘనంగా చాటేలా నిర్వహిస్తున్న దశాబ్ద వేడుకలలో ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

అనంతరం పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ఒగ్గుడోలు బోనాలు కళాకారులు చే చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను అలరించాయి.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, జడ్పీ చైర్ పర్సన్ శ్రీ హర్షిని, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, అదనపు కలెక్టర్ దివాకర అసిస్టెంట్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ మున్సిపల్ చైర్ పర్సన్ వెంకట్రాణి సిద్దు, , గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్, జిల్లా అధికారులు, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ జెడ్పిటిసిలు ఎంపిటిసిలు ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు…..

జిల్లా పౌర సంబంధాల అధికారి,జయశంకర్ భూపాలపల్లి చే జారీ చేయనైనది.

Share This Post