ADBDPRO -ఐదవ విడత పల్లె ప్రగతిని విజయవంతం చేయండి- జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్.

ఐదవ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని పండుగ వాతావరణంతో ప్రారంభించి విజయవంతం చేయాలనీ జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. సోమవారం రోజున జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రెండు విడతలలో పల్లె ప్రగతి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా చైర్మన్ మాట్లాడుతూ, ప్రజల భాగస్వామ్యం, ప్రజాప్రతినిధుల సహకారం, అధికారుల పర్యవేక్షణాలకు పల్లె ప్రగతి కార్యక్రమాన్ని 15 రోజుల పాటు షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలను నిర్వహించాలని అన్నారు. గ్రామాల్లో పారిశుద్యం, హరితహారం కార్యక్రమాలను పంచాయితీ కార్యదర్శులు బాధ్యతగా పని చేసి అధికారుల మెప్పును పొందాలని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మానస పుత్రిక అయిన తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటి పర్యావరణాన్ని సమతుల్యం చేయడం జరుగుచున్నదని తెలిపారు. భవిష్యత్ తరాల వారికీ పచ్చదనం, మంచి వాతావరణం కల్పించి గ్రామాలు సుందరంగా తీర్చి దిద్దే ప్రయత్నం పంచాయితీ కార్యదర్శులు చేసి చిరస్థాయిగా నిలవాలని కోరారు. సమస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధుల సహకారం ఉంటుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ, ఐదవ విడత తెలంగాణకు హరితహారం 15 రోజుల పాటు ప్రభుత్వం జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం ప్రజల భాగస్వామ్యంతో ప్రజాప్రతినిధుల సహకారంతో విజయవంతం చేయాలనీ అన్నారు. అధికారులు క్షేత్ర స్థాయి సిబ్బంది కష్టపడి పనిచేసి జిల్లా కు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ముఖ్యంగా గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలను ప్రధాన అంశంగా తీసుకొని నిర్వహించాలని అన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా శానిటేషన్ కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగించాలని అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లోని అన్ని రోడ్లలో ఎవెన్యూ ప్లాంటేషన్ యాదాద్రి మోడల్లో నిర్వహించాలని అన్నారు. గతంలో హరితహారం క్రింద నాటిన మొక్కల మధ్యలో, చనిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలను నాటి సంరక్షించాలని అన్నారు. పల్లె ప్రకృతి వనాల్లో దట్టమైన మొక్కలను పెంచాలని అన్నారు. బృహత్ పల్లె ప్రకృతి వనాలలో అధికారులు సూచించిన ప్రకారంగా అటవీ శాఖ అధికారుల సహకారం తో మొక్కలను నాటి సంరక్షించాలని అన్నారు. జాతీయ రహదారికి ఇరువైపులా టేకోమా వంటి మొక్కలను నాటాలని అన్నారు. ఇంటింటి చెత్త సేకరణ చేపట్టి డంపింగ్ యార్డ్ లకు తరలించి వర్మీ కంపోస్ట్ ప్రతి గ్రామంలో తయారు చేయాలన్నారు. గ్రామాల్లో నిర్మించిన వైకుంఠ ధామాలలో నీటి సరఫరా, విద్యుత్, బయో ఫెన్సింగ్ లను ఏర్పాటు చేసుకోవాలని, వైకుంఠధామలను ప్రజలు వినియోగించుకునే విధంగా చూడాలని అన్నారు. వసతి గృహాలలో శానిటేషన్ కార్యక్రమాలను నిర్వహించాలని, ప్రతి హాస్టల్ లో తప్పని సరిగా హరితహారం క్రింద మొక్కలను నాటి సంరక్షించాలని, అలాగే ప్రతి హాస్టల్ లో న్యూట్రిషన్ గార్డెన్ ఏర్పాటు చేయాలనీ స్పష్టం చేశారు. నీటి పారుదల శాఖ అధీనం లోని చెరువులు, కుంటలు, కాలువలు, ప్రాజెక్టుల పరిధులలో మొక్కలు నాటి సంరక్షించాలని అన్నారు. వేసవి కాలం దృష్ట్యా వసతి గృహాల్లోని సంక్షేమ అధికారులు, ITDA అధికారులు, సిబ్బందిని కూడా పల్లె ప్రగతి కార్యక్రమంలో వినియోగించుకోవాలని ఎంపీడీఓ లకు సూచించారు. పల్లె నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించాలని అన్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో పల్లె ప్రగతి నిర్వహణ ఏర్పాట్లపై మండల, గ్రామ స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో నిర్వహించాలని అన్నారు. రెండవ సెషన్ లో జరిగిన అవగాహన సమావేశంలో బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపు రావు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రము ఆవిర్భవించిన అనంతరం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు బాధ్యతగా విధులు నిర్వహించినపుడే పల్లెలు ప్రగతి సాధిస్తాయని అన్నారు. బోథ్ నియోజక వర్గంలో గతంలో చేపట్టిన పనుల వలన అవార్డులు రావడం జరిగిందని, అదే తరహాలో మునుముందు కుండా అధికారులు మంచిగా పనిచేసి పేరు సంపాదించుకోవాలని అన్నారు. జూన్ 3 నుండి 18 వరకు 15 రోజుల పాటు జరిగే పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేసి నియోజకవర్గానికి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఈ రెండు సెషన్ లలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాను బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా చేయడానికి పర్యవేక్షణ అవసరమని, ఇంకను అవసరమున్న వారికీ మరుగుదొడ్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను బ్యాన్ చేయడం జరిగిందని, అట్టి ప్లాస్టిక్ వినియోగించిన వారికీ ఫైన్ విధించాలన్నారు. గ్రామాలలో పంచాయితీ కార్యదర్శులు ఉదయం 6 గంటలకు వారి విధుల్లో చేరి పారిశుధ్య కార్యక్రమాలను పర్యవేక్షించాలని అన్నారు. పారిశుధ్య లోపం వలన మలేరియా డెంగ్యూ వంటి జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయని తెలిపారు. 15 రోజుల పాటు జరిగే ఐదవ విడత పల్లె ప్రగతి రోజులవారి కార్యక్రమాలపై వివరించి తప్పనిసరిగా షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. మొదటి రోజు గ్రామసభ నిర్వహించి పాదయాత్ర చేపట్టాలని అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ, రక్త హీనత, ఆరోగ్య సమస్యలపై వివరించారు. జిల్లా మలేరియా అధికారి డా.శ్రీధర్ మాట్లాడుతూ, పరిసరాల పరిశుభ్రత వలన రోగాలు రాకుండా నిరోధించవచ్చని, వర్షాకాలంలో ప్రతి రోజు డ్రై డే పాటించాలని, వ్యక్తిగత పరిశుభ్రతపై విద్యార్థులకు, గ్రామప్రజలు వివరించాలని అన్నారు. గ్రామీణ మంచి నీటి సరఫరా ఎస్.ఈ. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, వర్షాకాలంలో వాటర్ ట్యాంక్ లలో నీటిని నింపే ప్రతి సారి క్లోరినేషన్ చేయాలనీ, లీకేజీలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పగిలిపోయిన ప్లాట్ ఫామ్ లు సరిచేసుకోవాలని అన్నారు. హరితహారం కార్యక్రమం క్రింద మొక్కలు నాటే విధానం పై అవగాహన కల్పించారు. ఈ అవగాహన కార్యక్రమంలో అటవీ అభివృద్ధి అధికారులు రాహుల్, బార్నాల, జిల్లా పంచాయితీ అధికారి శ్రీనివాస్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, జిల్లా పరిషత్ సీఈఓ గణపతి, అదనపు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రవీందర్ రాథోడ్, జిల్లా షెడ్యూల్డు కులాల సంక్షేమ అధికారి సునీతకుమారి, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, ఎంపీడీఓ లు, ఎంపీఓ లు, ఎపిఓలు, పంచాయితీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post