ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు 2వ విడత కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. శనివారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో కంటి వెలుగు కార్యక్రమం నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ప్రజల కంటి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా కార్యచరణ అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. వయసు అర్హత గల ప్రతి ఒక్కరికి శిబిరాలలో పరీక్షలు నిర్వహించి మందులు, అవసరమైన వారికి కంటి అద్దాలు పంపిణీ చేయాలని, ఈ శిబిరాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు.
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ జిల్లాలో కంటి వెలుగు నిర్వహణ కొరకు 26 కంటి వెలుగు శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగిందని, పరీక్షల కోసం శిబిరాలకు వచ్చే వారికి త్రాగునీరు, షామియానా, కుర్చీలు తదితర సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. శిబిరాల నిర్మాణ కోసం నియమించిన బృంద సభ్యులకు భోజనం, వసతి ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. పరీక్షలకు వచ్చే వారి వివరాలను నమోదు చేసి డాటా ఎంట్రీ చేయుటకు చర్యలు తీసుకుంటున్నామని, కంటి పరీక్ష చేయించుకున్న అవసరమైన వారికి రీడింగ్ గ్లాసులు అందించడం జరుగుతుందని తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ, పోలీసు, పంచాయతీరాజ్, సంబంధిత శాఖల సమన్వయంతో శిబిరాల నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రతి శిబిరాన్ని పర్యవేక్షిస్తూ సమయపాలన పాటించే విధంగా పరిశీలించడం జరుగుతుందని తెలిపారు. కంటి వెలుగు శిబిరాల నిర్వహణపై అప్రమత్తంగా ఉంటూ క్షేత్రస్థాయిలో అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ప్రభాకర్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వర్, జిల్లా పంచాయతీ అధికారి రమేష్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సురేందర్, ఉప వైద్యాధికారులు సుధాకర్ నాయక్, సీతారాం, సునీల్ రావు, ప్రోగ్రాం అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి-కొమరంభీం ఆసిఫాబాద్ చే జారీ చేయడమైనది.