జిల్లాలో ఆహార భద్రతా చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ రాజేశం, జిల్లా పరిషత్ చైర్మన్ కోవ లక్ష్మి, ఆసిఫాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు ఆత్రం సక్కుతో కలిసి విజిలెన్స్ కమిటీ సభ్యులు, సంబంధిత అధికారులతో జాతీయ ఆహార భద్రత చట్టం అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జాతీయ ఆహార భద్రత చట్టము అమలుపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. దారిద్రరేఖకు దిగువన ఉన్న ప్రజలకు బియ్యం, ఇతర సరుకులు అందించడం జరుగుతుందని, జిల్లాలో 1 లక్ష 39 వేల 920 ఆహార భద్రత కార్డుల ద్వారా లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని, అర్హులైన లబ్ధిదారులకు అంత్యోదయ, అన్నపూర్ణ కార్డుల బియ్యం పంపిణీ జరుగుతుందని తెలిపారు. విజిలెన్స్ కమిటీ లో ఉన్న సభ్యులు, అధికారులు చౌక ధరల దుకాణాల నందు డీలర్లు బియ్యం పంపిణీ చేసే సమయంలో తనిఖీలు నిర్వహించి ప్రజలకు అందుతున్న బియ్యం, సరుకులను పరిశీలించాలని తెలిపారు. పి. డి. ఎస్. బియ్యం అక్రమంగా రవాణా జరగకుండా అందరూ కృషి చేయాలని, ప్రజలకు దగ్గరగా షాపులు ఏర్పాటు చేసి సరుకుల పంపిణీకి చర్యలు తీసుకోవాలని, అంగన్వాడి, మధ్యాహ్న భోజనం కొరకు నాణ్యమైన సరుకులు పంపిణీ చేయాలని, సంబంధిత సిబ్బంది సరుకులు తూకంపై పర్యవేక్షించాలని తెలిపారు. ఆసిఫాబాద్ శాసనసభ్యులు, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జిల్లాలోని మారుమూల గ్రామాలలో ప్రజల సౌకర్యార్థం చౌక ధరల దుకాణాల సంఖ్య పెంచాలని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా కలెక్టర్ మాట్లాడుతూ తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామాలలో చౌక ధరల దుకాణాల నందు బియ్యం, సరుకుల పంపిణీ పై విజిలెన్స్ అధికారులు తమ సమీప షాపులను పరిశీలించాలని తెలిపారు. చనిపోయిన, పెళ్లి అయి వెళ్లిపోయిన వారి పేర్లను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని, ఆన్లైన్ పోర్టబుల్ సిస్టం ఉన్నందున జిల్లాలో ఎక్కడైనా బియ్యం తీసుకుని అవకాశముందని, లబ్ధిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్. డి. ఓ. రాజేశ్వర్, పౌరసరఫరాల శాఖ అధికారులు, విజిలెన్స్ కమిటీ సభ్యులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి కొమరం భీమ్ ఆసిఫాబాద్ చే జారీ చేయబడినది.