తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 10వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులు, అన్ని శాఖల జిల్లా అధికారులతో జూన్ 2వ తేదీన నిర్వహించే రాష్ట్ర అవతరణ దినోత్సవ, దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి మాట్లాడుతూ జూన్ 2వ తేదీన నిర్వహించే రాష్ట్ర అవతరణ దినోత్సవం తో పాటు 22వ తేదీ వరకు నిర్వహించనున్న దశాబ్ది ఉత్సవాలను అన్ని జిల్లాలలో విజయవంతం చేసే దిశగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. 21 రోజులపాటు కొనసాగే దశాబ్ది ఉత్సవాలను ప్రభుత్వ ఆదేశాలు, కార్యచరణ ప్రకారం నిర్వహించాలని తెలిపారు.
జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనంలో గల వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు, జిల్లా అదనపు కలెక్టర్లు రాజేశం, చాహత్ బాజ్ పాయి, ఎస్. పి. సురేష్ తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని అమరవీరులకు నివాళులు అర్పించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం జిల్లా అభివృద్ధిపై ముఖ్య అతిధిచే ఉపన్యాస కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ప్రభుత్వ శాఖల స్టాళ్లు ఏర్పాటు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కొరకు చర్యలు తీసుకుంటామని, ప్రతి కార్యాలయం వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. జూన్ 3వ తేదీన జిల్లాలోని 70 రైతు వేదికల వద్ద రైతులు, అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు, రైతు బీమా తదితర పథకాలను వివరిస్తూ, రైతుల సంక్షేమం దిశగా ప్రభుత్వం చేస్తున్న కృషిని తెలియజేయడం జరుగుతుందని, అనంతరం ప్రతి రైతు వేదిక వద్ద దాదాపు 1 వేయి మందికి పైగా రైతులకు భోజనం ఏర్పాటు చేస్తామని, ప్రతి రైతు వేదికకు ఒక ప్రత్యేక అధికారిని నియమించి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. 21 రోజుల పాటు ప్రభుత్వం రూపొందించిన కార్యాచరణ ప్రకారం ప్రభుత్వ శాఖలతో కార్యక్రమాలు నిర్వహించి, శాసనసభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్, మండల ప్రజా పరిషత్ ప్రతినిధులు, జెడ్ పి టి సి లు, మున్సిపల్ కమిషనర్లు, వార్డు కౌన్సిలర్లు, ఎం పి టి సి లు, సర్పంచ్లను సమన్వయం చేసుకొని దశాబ్ది ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. గడిచిన 9 సంవత్సరాలలో జరిగిన అభివృద్ధిపై ప్రతి గ్రామంలో ప్రచారం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని, ప్రజలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై వివరించడం జరుగుతుందని, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనకబడిన తరగతులు, మైనారిటీ ల సంక్షేమం, దళిత బంధు పథకాలపై విస్తృత ప్రచారం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జూన్ 2 నుండి 22వ తేదీ వరకు జరిగే దశాబ్ది ఉత్సవాలలో ప్రతి శాఖ కార్యక్రమాలు అందరి సహకారంతో విజయవంతం చేసే దిశగా కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి – కొమురంభీం ఆసిఫాబాద్ చే జారీ చేయనైనది.