పోడు భూముల సర్వే ప్రక్రియలో భాగంగా జిల్లాలోని గ్రామపంచాయతీల పరిధిలో నిర్వహిస్తున్న గ్రామసభలో పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల వివరాల నమోదు ఎలాంటి పక్షపాతం లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. శనివారం జిల్లాలోని ఆసిఫాబాద్ మండలం మోవాడ్ గ్రామపంచాయతీలోని సిరియాన్, మోవాడ్, లింబు గూడ లలో నిర్వహించిన ఆర్.ఓ.ఎఫ్.ఆర్. గ్రామ సభలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్.ఓ.ఎఫ్.ఆర్ చట్టం 2005 ప్రకారం పోడు వ్యవసాయం సాగు చేసుకుంటున్న అర్హులైన గిరిజనులకు పట్టాలు అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన పోడు భూముల సర్వే ప్రక్రియ ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. ఆర్.ఓ.ఎఫ్.ఆర్. చట్టం ప్రకారం 2005 కంటే ముందు నుండి సాగులో ఉన్నట్లు ఆధారాలు సమర్పించాలని దరఖాస్తుదారులకు సూచించారు. గ్రామ సభలో ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో మోవాడు సర్పంచ్ వెడ్మ కౌసల్య, కార్యదర్శి శ్వేతా రాణి, అటవీ సెక్షన్ అధికారి సురేష్, ఆర్.ఓ.ఎఫ్.ఆర్. కమిటీ సభ్యులు, దరఖాస్తుదారులు, ప్రజలు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి-కొమరంభీం ఆసిఫాబాద్ చే జారీ చేయడమైనది.