ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనంలో గల కలెక్టర్ ఛాంబర్ లో అర్జిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. జిల్లాలోని కోసిని గ్రామానికి చెందిన వసాకే హనుమంతు తాను మీ సేవ కేంద్రం కొరకు దరఖాస్తు చేసుకొని పరీక్ష రాసి అర్హుడిని అయ్యానని, తనకు మీసేవ కేంద్రం మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలోని పవార్ గూడ గ్రామానికి చెందిన వాగ్మా రే భారత బాయి తాము గత సంవత్సరాలుగా గ్రామ శివారులోని భూమిని సాగు చేసుకుంటూ జీవిస్తున్నామని, ఇటీవల కొందరు తమ భూమిని ఆక్రమించుకొని పత్తి పంట వేశారని, ఇట్టి భూమికి సంబంధించిన దస్తావేజులు, పహానీలు ఉన్నాయని, వీటిని పరిశీలించి మాకు న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. ఆసిఫాబాద్ మండలం ఎక్స్ రోడ్ భాగ్యనగర్ కాలనీకి చెందిన ఎడిగినల మోసెస్ తమకు సంబంధించిన భూమి, ఇల్లు అడ గ్రామము ముంపులో పోయినందున అప్పుడు మాకు ఫ్లాట్ నెంబర్ 51 చూపించి ఇల్లు నిర్మించుకోండి పట్టాలు ఇస్తామని చెప్పారని, 12 సంవత్సరాలుగా మేము ఇక్కడే నివసిస్తున్నామని, ఇప్పుడు మరో వ్యక్తి ఈ భూమి నాది అంటున్నారని, ఈ విషయమై విచారణ జరిపి మాకు న్యాయం చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. రెబ్బెన మండలం గోలేటి గ్రామానికి చెందిన జాడి ప్రభాకర్ తాను వికలాంగుడినని, 90 శాతంతో సదరం సర్టిఫికెట్ కూడా ఉందని, దివ్యాంగుల పింఛన్ మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. కాగజ్ నగర్ మండలం రాజీవ్ నగర్ గ్రామానికి చెందిన సవిత దేవి కౌటాల మండలం రవీంద్ర నగర్ గ్రామంలో తమ తండ్రికి గల భూమిని తనకు తెలియకుండా తన చెల్లెలు పట్టా చేయించుకున్నారని, దీనిపై విచారణ జరిపి న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. దహేగాం మండలం రాంపూర్ గ్రామానికి చెందిన తలండి మొండయ్య తన కూతురుకి వివాహం చేశానని తమకు కళ్యాణ లక్ష్మి ఇప్పించాలని కోరుతూ అర్జీ సమర్పించారు. బెజ్జూరు మండలం మర్త్తిడి గ్రామానికి చెందిన బొర్కుట్ గంగారం తన భూమిని కొందరు అక్రమంగా ఆక్రమించుకున్నారని, తనకు న్యాయం చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో అందిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం దిశగా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి-కొమరంభీం ఆసిఫాబాద్ చే జారీ చేయడమైనది.