ASF : ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా చర్యలు : జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు


ప్రభుత్వ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందే విధంగా సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ చాహత్ బాజ్ పాయితో కలిసి వివిధ బ్యాంకుల అధికారులు, జిల్లా అధికారులతో త్రైమాసిక రుణాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందే విధంగా బ్యాంకర్లు సంబంధిత అధికారులు సంయుక్తంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జీవనజ్యోతి బీమా యోజన, సురక్ష బీమా యోజన, అటల్ బీమా యోజన క్రింద అర్హులైన వారిని గుర్తించి పథకాల ఫలాలను అందేలా చర్యలు తీసుకోవాలని, అన్ని సంక్షేమ వసతి గృహాలలోని విద్యార్థిని విద్యార్థులకు ఖాతాలు తెరిచేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని తెలిపారు. స్వయం సహాయక సంఘాలకు నిర్దేశించిన రుణాల లక్ష్యాలను సాధించాలని, పంట రుణాలు పొందిన రైతులకు భీమ వర్తించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. వ్యవసాయ విస్తరణ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు రైతు రుణాలు, బీమా వర్తింపు పై దృష్టి సారించి 100 శాతం లక్ష్యాలను పూర్తి చేసేందుకు కృషి చేయాలని తెలిపారు. 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు వారందరినీ నమోదు చేయాలని, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, యువతి యువకులకు నైపుణ్యత పై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతులు, మైనారిటీ కార్పొరేషన్, గిరిజన సంక్షేమ శాఖ క్రింద రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకర్లు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. గిరిజన సంక్షేమ శాఖ క్రింద మంజూరు అయిన లబ్ధిదారులకు వెంటనే ఖాతాలు తీసే విధంగా బ్యాంకర్లు దృష్టి సారించాలని, మార్చి 31వ తేదీలోగా ఖాతాలు తెరిచి రాయితీ అందించేందుకు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా బ్యాంకర్లు రుణాలు పంపిణీ చేయాలని, స్వయం సహాయక సంఘాల గ్రూపులకు 100 శాతం రుణ మంజూరు జరిగే విధంగా చూడటంతో పాటు వ్యక్తిగత, స్వల్ప, దీర్ఘకాలిక రుణాల మంజూరు పై బ్యాంకు అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. రుణ పంపిణీ పై నిర్దేశిత లక్ష్యాలను మాసంతంలోగా పూర్తి చేసేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ హనుమంతరావు, వివిధ బ్యాంకుల అధికారులు, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సురేందర్, సంక్షేమ శాఖ అధికారులు మణెమ్మ, సజీవన్ రావు, సత్యనారాయణ రెడ్డి, షేక్ మహమ్మద్, ఏ పి డి లు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి కొమరం భీమ్ ఆసిఫాబాద్ చే జారీ చేయబడినది.

Share This Post