ASF : మన ఊరు – మన బడి కార్యక్రమం ద్వారా పాఠశాలల అభివృద్ధి :  జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

విద్యార్థినీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే దిశగా ప్రభుత్వం చేపట్టిన మన ఊరు మనబడి కార్యక్రమంలో జిల్లాలో మొదటి విడతలు ఎంపికైన పాఠశాలలలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, జిల్లా విద్యాధికారి అశోక్ తో కలిసి మన ఊరు మనబడి కార్యక్రమం నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మన ఊరు మనబడి కార్యక్రమంలో జిల్లాలో ఎంపికైన పాఠశాలలలో మిగిలి ఉన్న పనులను దసరా సెలవులు అయ్యేలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులు, పాఠశాలల విద్యా కమిటీ సభ్యుల సమన్వయంతో పనులు పూర్తి చేయాలని తెలిపారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాలను గ్రామపంచాయతీలో తీర్మానం చేసి తొలగించాలని, ఆయా పరిధిలోని ఏజెన్సీ లతో ఒప్పందం చేసుకొని పనులను పూర్తి చేసే విధంగా సంబంధిత అధికారులు చొరవ చూపాలని తెలిపారు. పాఠశాలల్లో విద్యుత్ సరఫరా, త్రాగునీరు, ఫర్నిచర్ ఏర్పాటు చేయడంతో పాటు పాఠశాలల భవనాలకు పెయింటింగ్ పనులతో సహా పూర్తి చేసే విధంగా ఇంజనీరింగ్ విభాగాల అధికారులు దృష్టి సారించాలని తెలిపారు. ఇప్పటివరకు టెండర్ పూర్తికాని పాఠశాలలకు సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు. నవంబర్ 14వ తేదీ నాటికి జిల్లాలో 50 పాఠశాలలు ప్రారంభించే విధంగా అధికారులు పనులు పూర్తి చేయాలని, దసరా సెలవులు పూర్తి అయ్యేలోగా వసతి గృహాల మరమ్మత్తు పనులు చేపట్టాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ఇంజనీరింగ్ విభాగాల అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి – కొమురంభీం ఆసిఫాబాద్ చే జారీ చేయనైనది.

Share This Post