ASF : మహానుభావులు మనకు అందించిన స్వేచ్ఛ ఫలమే రాజ్యాంగం : జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

 

బానిస సంకెళ్ల నుండి విముక్తి పొంది దేశానికి స్వాతంత్రం సిద్ధించిన అనంతరం డా. బి. ఆర్. అంబేద్కర్ సారధ్యంలో మహనీయుల రూపొందించిన రాజ్యాంగం మనకు ఎన్నో హక్కులను కల్పించిందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన ఆవరణలో 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీసు గౌరవ వందనం అనంతరం జిల్లా అదనపు కలెక్టర్లు రాజేశం, చాహత్ బాజ్ పాయి, ఎస్. పి. సురేష్ కుమార్, అదనపు ఎస్.పి. లు అచ్చేశ్వరరావు, భీమ్ రావు, ఆసిఫాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు ఆత్రం సక్కు తో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో ఎందరో త్యాగధనుల కృషి, ప్రాణ త్యాగాల ఫలితంగా స్వాతంత్రం సంపాదించుకొని, రాజ్యాంగాన్ని రూపొందించుకొని స్వేచ్ఛ స్వాతంత్రాలను అనుభవిస్తున్నామని అన్నారు. రాజ్యాంగం ప్రకారం దేశంలోని ప్రతి పౌరుడికి కుల మత వర్ణ వర్గ ప్రాంత లింగ భేదాలు లేకుండా సమాన హక్కు ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగం కల్పించిన హక్కులను పొందడంతో పాటు తమ విధులను, బాధ్యతలను తెలుసుకొని దేశ అభివృద్ధికి పాటుపడాలని తెలిపారు. స్వాతంత్ర పోరాట యోధులు, మహనీయుల ఆశయాలను స్మరించుకుంటూ జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాల ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, రాష్ట్ర ఏర్పాటు తర్వాత కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా అన్ని రంగాలలో ముందు వెళ్తుందని అన్నారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, ప్రజల సహకారంతో అధికార యంత్రాంగం జిల్లా అభివృద్ధికి కృషి చేస్తుందని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లాలోని చారిత్రాత్మక స్థలాలు, జిల్లా నైసర్గిక స్వరూపంపై రచించిన పాటను పట్టణంలోని సెయింట్ మేరీ విద్యార్థులు నృత్యం ద్వారా ప్రదర్శించారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు యోగపై, గిరిజన గురుకుల బాలికల పాఠశాల విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల వ్యవసాయము కుల వృత్తులపై, గిరిజన కళాకారుడు తెలంగాణ గానంపై ఫ్లూట్ ప్రదర్శనల ద్వారా అందరినీ ఆకట్టుకున్నారు. జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన అధికారులు, ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేయడం జరిగింది. తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు ఆలపించిన దేశభక్తి గీతాలు అందరినీ అలరించాయి. అనంతరం జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వెదురుతో తయారుచేసిన కళాకృతులు, వస్తువుల స్టాల్స్ ను సందర్శించారు. సామాజిక కార్యక్రమాలలో విశిష్ట సేవలందించిన వారితో పాటు తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులకు మెమొంటోలు, ప్రశంసా పత్రాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వర్, డి. ఎస్. పి.లు కరుణాకర్, శ్రీనివాస్, జెడ్. పి. టి. సి. లు నాగేశ్వర్ రావు, సంతోష్, పద్మశ్రీ అవార్డు గ్రహీత గుస్సాడీ కనకరాజు, మండల ప్రజాపరిషత్ సభ్యులు మల్లికార్జున్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లేష్, ప్యాక్స్ చైర్మన్ అలీబిన్ అహ్మద్, జిల్లా అధికారులు, పుర ప్రముఖులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి-కొమరంభీం ఆసిఫాబాద్ చే జారీ చేయడమైనది.

Share This Post