ASF : యాసంగి ధాన్యం కొనుగోలు ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలి: రాష్ట్ర పౌరసరఫరాలు, వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్


రైతుల సంక్షేమం అభివృద్ధి కొరకు ప్రభుత్వమే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా మద్దతు ధర చెల్లించి ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుందని రాష్ట్ర పౌరసరఫరాలు, వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుండి పౌరసరఫరాల శాఖ చైర్మన్ రవీందర్ సింగ్, ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ, సహకార శాఖ అధికారులతో యాసంగి ధాన్యం కొనుగోలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పౌరసరఫరాలు, వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ప్రభుత్వమే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల వద్ద నుండి మద్దతు ధర చెల్లించి ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని, అనంతరం ఈ ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించడం జరుగుతుందని తెలిపారు. కొనుగోలు కేంద్రాలలో రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా త్రాగునీరు, నీడ, ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేయడంతో పాటు వృద్ధులు, దివ్యాంగ రైతులకు ప్రాధాన్యత ఇస్తూ ముందుగా వారి నుండి ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. యాసంగి ధాన్యం కొనుగోలు ప్రక్రియను త్వరగా పూర్తిచేసే విధంగా అధికారులు దృష్టి సారించాలని తెలిపారు.

జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనంలో గల వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు, జిల్లా అదనపు కలెక్టర్ రాజేశం తో కలిసి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వరి పంట సాగు చేసే మండలాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని, టూ కం అయినా వాటిని వెంటనే రైస్ మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ధాన్యం కొనుగోలు సమయంలో సంబంధిత రైతుకు రసీదు అందించి ట్యాబ్లలో వివరాలు నమోదు చేయడం జరుగుతుందని, ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేయడం జరుగుతుందని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గన్ని సంచులను సరఫరా చేయడం జరుగుతుందని, కొనుగోలు కేంద్రాల నుండి తరలించిన ధాన్యాన్ని రైస్ మిల్లర్లు త్వరగా దిగుమతి చేసే విధంగా అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామని, వడ్ల సేకరణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల మేనేజర్, సహకార, వ్యవసాయ శాఖల అధికారులు, ఐ కె పి అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి – కొమురంభీం ఆసిఫాబాద్ చే జారీ చేయనైనది.

Share This Post