పేదవారికి గూడు కల్పించాలని ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు పడక గదుల ఇండ్ల పథకంలో భాగంగా ఎంపికైన అర్హులైన లబ్ధిదారులకు జనవరి 15, 2023 నాటికి పంపిణీ చేసేందుకు సిద్ధం చేయాలని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాదు నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, హౌసింగ్ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 18 వేల 328 కోట్ల రూపాయల వ్యయంతో 2.91 లక్షల రెండు పడక గదుల ఇండ్లు నిర్మించి అర్హులైన లబ్ధిదారులను గుర్తించి పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, జి.హెచ్.ఎం.సి. పరిధి మినహాయించి రాష్ట్ర వ్యాప్తంగా 62 వేల రెండు పడక గదుల ఇండ్లు పూర్తయ్యాయని, 40 వేల ఇండ్ల నిర్మాణం తుది దశలో ఉన్నాయని తెలిపారు . 33 వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి 26 వేల ఇండ్లను అందజేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జిల్లా కలెక్టర్లు వారి పరిధిలో నిర్మాణం పూర్తయిన, తుది దశలో ఉన్న ఇండ్లకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని, రెండు పడక గదుల ఇండ్లు నిర్మించిన గ్రామం, పట్టణ పరిధిలో అధిక సంఖ్యలో అర్హులైన లబ్దిదారులకు ఉన్న నేపథ్యంలో లాటరీ పద్ధతి ద్వారా పారదర్శకంగా ఎంపిక చేయాలని, మిగిలిన అర్హుల వివరాలతో వెయిటింగ్ లిస్టు తయారు చేయాలని తెలిపారు. రెండు పడక గదుల ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక, పూర్తయిన ఇండ్ల పంపిణీ క్షేత్రస్థాయిలో సమాంతరంగా జరగాలని, పంపిణీ పూర్తయిన లబ్ధిదారుల వివరాలు ప్రభుత్వ పోర్టల్ లో నమోదు చేయాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 283 కాలనీలో 18 వేల రెండు పడక గదుల ఇండ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని, సంబంధించిన శాసనసభ్యులను సమన్వయం చేసుకుంటూ కంపెనీ కార్యక్రమం త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఇండ్లకు త్రాగునీటి సరఫరా, డ్రైనేజీ, విద్యుత్ కనెక్షన్ వంటి మౌళిక వసతుల కల్పనకు 205 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, పనులు చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. 18 వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులో భాగంగా ఇప్పటి వరకు 11వేల 990 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించడం జరిగిందని, రాష్ట్ర వ్యాప్తంగా తుది దశ నిర్మాణంలో ఉన్న 40 వేల రెండు పడక గదుల ఇండ్లు వేగవంతంగా పూర్తి జరిగేలా జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించాలని తెలిపారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ రెండు పడక గదుల ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక, తుది దశలో ఉన్న ఇండ్ల నిర్మాణం, మౌళిక వసతుల కల్పన వంటి అంశాల పై జిల్లాకు ప్రత్యేక కార్యచరణ రూపొందించుకుని అమలు చేయాలని, జిల్లాలో పంపిణీకి సిద్ధంగా ఉన్న ఇండ్లను స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకొని తేదీ నిర్ణయించుకొని పంపిణికి సిద్ధం చేయాలని తెలిపారు.
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ జిల్లాలో రెండు పడకగదుల ఇండ్ల పథకంలో 572 ఇండ్లు మంజూరయ్యాయని, అర్హులైన లబ్ధిదారుల ఎంపికకు ప్రజా ప్రతినిధులతో కలిసి గ్రామసభలు నిర్వహించడం జరుగుతుందని, గ్రామ సభల ద్వారా అర్హులైన లబ్ధిదారులను గుర్తించి ఇండ్లను కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అవసరమైన చోట లాటరీ పద్ధతి ద్వారా లబ్ధిదారులకు ఇండ్లు కేటాయించడం జరుగుతుందని, నిర్ణీత సమయానికి త్రాగునీరు, విద్యుత్, మురుగు కాలువలు, రోడ్లు మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. పోడు భూముల ప్రక్రియలో భాగంగా సర్వే చేపట్టి గ్రామసభలు నిర్వహించడం జరుగుతుందని, జిల్లాలో 159 గ్రామసభలు పూర్తయ్యాయని, ఈ వివరాలను ఎస్. డి. ఎల్. సి. కమిటీకి అందించడం జరుగుతుందని తెలిపారు. బృహత్ పల్లె ప్రకృతి వనాలలో మొక్కల సంరక్షణకు పూర్తిస్థాయి చర్యలు తీసుకుంటున్నామని, జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా భూ సేకరణకు సంబంధించి పూర్తిస్థాయి నష్టపరిహారం స్పందించడం జరిగిందని, జీ.ఓ నం.58, 59 ప్రకారం వచ్చిన దరఖాస్తులను పరిశీలించడం జరుగుతుందని, జీ. ఓ. నం.76 ప్రకారం సింగరేణి భూముల క్రమబద్ధీకరణలో భాగంగా సర్వే కార్యక్రమం చేపడుతున్నామని, టి.ఎం.33 పై వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు రాజేశం, చాహత్ బాజ్ పాయి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సురేందర్, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి మణెమ్మ, కాగజ్ నగర్ ఆర్. డి. ఓ. రాజేశ్వర్, పంచాయతీ రాజ్ ఈ. ఈ. పెద్దన్న, సర్వే ఏ. డి. సోమేశ్వర్ సంబంధిత శాఖల అధికారులు తదితరులు.
జిల్లా పౌర సంబంధాల అధికారి-కొమరంభీం ఆసిఫాబాద్ చే జారీ చేయడమైనది