ASF : హక్కులకై పోరాడిన వీర వనిత చాకలి ఐలమ్మ : జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో హక్కుల కోసం పోరాడిన వీర వనిత చాకలి ఐలమ్మ అని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వీరనారి చాకలి ఐలమ్మ 127వ జయంతి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు రాజేశం, చాహత్ బాజ్ పాయి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కోవలక్ష్మి తో కలిసి హాజరై ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ ఉద్యమంలో వీరనారి చాకలి ఐలమ్మ ముఖ్య భూమిక పోషించారని తెలిపారు. చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందని, రజకుల అభివృద్ధి కొరకు ప్రభుత్వం రజకుల షాపులకు నిర్దేశిత యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తుందని, కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా పేద ప్రజల ఆడపిల్లల వివాహాలకు నగదు ప్రోత్సాహకాలు అందిస్తుందని అన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూర్తిగా ఆశయాల సాధనకు అందరూ కృషి చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సురేష్, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి సావిత్రి, జెడ్. పి. టి. సి. అరిగెల నాగేశ్వరరావు, ఎం. పి. పి. మల్లికార్జున్, రజక సంఘం జిల్లా అధ్యక్షులు కడతల మల్లయ్య, సంబంధిత శాఖల అధికారులు, రజక సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి – కొమురంభీం ఆసిఫాబాద్ చే జారీ చేయబడినది.

Share This Post