జిల్లాలో మాత శిశు మరణాలను 100 శాతం నియంత్రించేందుకు సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ చాహత్ బాజ్ పాయితో కలిసి జిల్లా వైద్యాధికారులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులతో ప్రజల ఆరోగ్యం, గర్భిణుల సంక్షేమం, రక్తహీనత లోపం నియంత్రణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో గర్భం దాల్చిన మహిళల వివరాలను నమోదు చేసి సమయానుసారంగా వారికి పరీక్షలు నిర్వహించి, రక్తహీనత సమస్య ఉన్న వారికి అవసరమైన మందులు, పోషకాహారం అందించాలని, గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు జరిగే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని, రక్తహీనత కలిగిన వారికి ఐరన్ మాత్రలు అందించాలని, వైద్య సేవలు అందించిన ప్రతి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని, హై రిస్క్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు జరిగిన మహిళలకు కేసీఆర్ కిట్లు అందించడం జరుగుతుందని తెలిపారు. మాత శిశు మరణాలను నియంత్రించే విధంగా గ్రామాలలో ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఉపవాద్యాధికారులు సుధాకర్ నాయక్, సీతారాం, సునీల్ రావు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అధికారులు, సిబ్బంది, సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి-కొమరంభీం ఆసిఫాబాద్ చే జారీ చేయడమైనది.