Asifabad : ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

జిల్లాలో మే 6వ తేదీ నుండి నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో అదనపు ఎస్.పి. (అడ్మిన్) అచ్చేశ్వరరావుతో కలిసి ఇంటర్ పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటర్ పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలో 20 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పోలీస్, వైద్య, విద్య, రవాణా, విద్యుత్, పోస్టల్ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 5 వేల 252 మంది ప్రథమ, 4 వేల 747 మంది ద్వితీయ సంవత్సరాల విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు కావలసిన మౌళిక సదుపాయాలు కల్పించడం జరిగిందని, బోర్డు నిబంధనల మేరకు డి.ఈ. సి. కస్టోడియన్లు, స్క్వాడ్ తదితర తనిఖీ బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లా పరీక్షల బృందం సభ్యులు నైతం శంకర్, తిరుపతి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మనోహర్, జిల్లా విద్యాధికారి అశోక్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి – కొమురంభీం ఆసిఫాబాద్ చే జారీచేయబడినది.

Share This Post