Asifabad : కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాను అన్ని రంగాల అభివృద్ధిలో ముందుంచాలి : జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాను ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో ప్రజలను భాగస్వాములను చేస్తూ అన్ని రంగాల అభివృద్ధిలో ముందుంచే విధంగా పూర్తి స్థాయిలో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనం సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ వరుణ్ రెడ్డి, ఎస్. పి. (అడ్మిన్) అచ్చేశ్వర్ రావు తో కలిసి అన్ని శాఖల జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని, అభివృద్ధి పనుల నిర్వహణలో ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఈ నెల 3 నుండి 18వ తేదీ వరకు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, గ్రామాలలో పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని, ప్రతిరోజు ఇంటింటికీ తిరుగుతూ తడి పొడి చెత్త లను సేకరించి డంపింగ్ యార్డుకు తరలించడంతో పాటు అట్టి చెత్తను ఆదాయ వనరుగా మార్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. రోడ్లపై, ఖాళీ ప్రదేశాలలో చెత్త వేయకుండా పర్యవేక్షించడంతో పాటు, మురుగు కాలువల లో నీరు, చెప్తా పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు పూడిక తీయాలని తెలిపారు. జిల్లాలో 36 గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా గుర్తించి ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ప్రత్యేక అధికారిని నియమించడం జరిగిందని, అధికారులు పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహించాలని తెలిపారు. ప్రతి గ్రామానికి వెల్కమ్ బోర్డు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, గ్రామాలలో నేరాలు, విధించే శిక్షలు పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి పోలీసు కేసులు లేని గ్రామాలుగా తీర్చిదిద్దాలని తెలిపారు. బాల్య వివాహాల నియంత్రణ పై ప్రత్యేక దృష్టి సారించి బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలు, ఆరోగ్య సమస్యలపై ప్రజలకు పూర్తి స్థాయిలో వివరించాలని తెలిపారు. ప్రతి గ్రామానికి త్రీఫేజ్ విద్యుత్ సరఫరా ఏర్పాటు చేయాలని, ప్రతి గ్రామంలో అవసరమయ్యే పండ్లు, కూరగాయలు ఇతరత్రా చిన్నతరహా ఆహార ఉత్పత్తులను ఆ గ్రామంలోనే పండించుకునే విధంగా రైతులను ప్రోత్సహించాలని, డిసెంబర్ నెలాఖరు వరకు అన్ని గ్రామాలకు పారామీటర్లు ఉండాలని తెలిపారు. గ్రామస్తులు అందరి సమక్షంలో గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ఖర్చులు, జమలు వివరాలను తెలియజేయాలని తెలిపారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిలో మరుగుదొడ్లు, ఇంకుడు గుంత ఉండేలా చూడాలని, వైకుంఠధామాలలో నీరు, విద్యుత్ సరఫరా సౌకర్యం కల్పించాలని, పాఠశాలల ఆవరణలో మొక్కలు నాటి సంరక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని, పిల్లలకు పౌష్టికాహారం అందించాలని, చిరు ధాన్యాల వినియోగం పై గ్రామాల వారీగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. గ్రామాలలో వేలాడే విద్యుత్ వైర్లు లేకుండా తగు చర్యలు తీసుకోవడంతో పాటు, విరిగిన, వంగిన విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలని తెలిపారు. మండలాలలో పల్లె ప్రకృతి వనరుల నిర్వహణలో అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని ఆదేశించారు. యాదాద్రి తరహాలో మొక్కకు మొక్కకు మధ్య దూరాన్ని ఉంచి సంరక్షించాలని సూచించారు. క్రీడా మైదానాల ఏర్పాటుకు కొరకు భూమి ని గుర్తించడం జరుగుతుందని, పిల్లలకు అన్ని రకాల ఆటల పోటీలు నిర్వహించి, డ్రాపౌట్ పిల్లలు పాఠశాలలకు వచ్చే విధంగా సంబంధిత శాఖల అధికారులు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల వారీగా మినీ గ్రంథాలయాల మాదిరిగా రీడింగ్ రూమ్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు. మన ఊరు మనబడి కార్యక్రమం లో భాగంగా జిల్లాలో ఎంపికైన పాఠశాలలో అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేసే విధంగా సంబంధిత శాఖల అధికారులు పనులు చేపట్టాలని తెలిపారు. దళితబంధు కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులు అందరు ఒకే విధమైన యూనిట్లను కాకుండా వివిధ రకాల యూనిట్లను ఎంచుకుని ఆయా రంగాలలో అభివృద్ధి చెందాలని, డైరీ, పౌల్ట్రీ తదితర రంగాలను ఎంపిక చేసుకునే విధంగా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని తెలిపారు. జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ నెల 2వ తేదీన ఉదయం 9 గంటలకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన ప్రాంగణంలో వేడుకలు నిర్వహించడం జరుగుతుందని, సాయంత్రం 4 గంటలకు కవి సమ్మేళనం కార్యక్రమం ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి – కొమురంభీం ఆసిఫాబాద్ చే జారీ చేయబడినది.

Share This Post