Asifabad : నిర్దేశిత లక్ష్యాలను సాధించి జిల్లాను అన్ని రంగాలలో ముందు ఉంచాలి : జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై అన్ని ప్రభుత్వ శాఖలకు కేటాయించిన నిర్దేశిత లక్ష్యాలను పూర్తిస్థాయిలో సాధించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్లు వరుణ్ రెడ్డి, రాజేశం లతో కలిసి అన్ని శాఖల జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి కోసం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం పని చేస్తుందని, వానాకాలం పంట సాగు లో భాగంగా జిల్లాలో లక్ష ఎకరాలకు సాగునీరు అందించడం లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందని, ఆ దిశగా నీటి పారుదల శాఖ అధికారులు తగు ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు. రైతులందరికీ రెండవ పంట సాగు కోసం విద్యుత్ కనెక్షన్లు అందించాలని, గ్రామాలలో రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి పంట సాగుపై తగు సూచనలు సలహాలు అందించాలని తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో గర్భిణులకు ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగే విధంగా అవగాహన కల్పించడంతో పాటు సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, మాతా, శిశు సంక్షేమం దిశగా తగు చర్యలు తీసుకోవాలని, కుటుంబ నియంత్రణ చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఖచ్చితంగా నిర్వహించాలని అందరికీ వ్యాక్సిన్ అందే విధంగా అధికారులు చొరవ చూపాలని తెలిపారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పౌల్ట్రీ ఫార్మ్స్, డైరీ మిల్క్ ప్రొడక్షన్ ఉత్పత్తులను అధికం చేయాలని, దళిత బంధు పథకంలో భాగంగా పౌల్ట్రీ ఫార్మ్స్ యూనిట్ల సంఖ్య పెంచి లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని తెలిపారు. గిరిజనులలో మూఢనమ్మకాలను తొలగించి వారిని అక్షరాస్యులను చేసి సాంఘిక అభివృద్ధి జరిగి వారి స్థితిగతులు మెరుగు పడే విధంగా సంబంధిత అధికారులు కార్యాచరణ రూపొందించాలని, డిసెంబర్ వరకు లక్ష్యాలను సాధించే విధంగా కృషి చేయాలని తెలిపారు. జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అర్హులైన దివ్యాంగులకు స్వయం ఉపాధి పథకంలో అవగాహన కల్పించి అభివృద్ధి చెందే విధంగా తోడ్పాటు అందించాలని తెలిపారు. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించడంలో సంబంధిత పాఠశాల యజమానులతో చర్చించి వారి ధ్రువపత్రాలను పరిశీలించాలని సూచించారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు సంబంధించిన అన్ని వివరాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలని తెలిపారు. కుమ్మరి కుల వృత్తుల వారిని ప్రోత్సహిస్తూ మట్టి పాత్రలు తయారీలో ప్రోత్సహించాలని తెలిపారు. మిషన్ భగీరథ పథకంలో భాగంగా జిల్లాలోని మారుమూల గ్రామాల వరకు నివాసాలతో పాటు పాఠశాలలు, కళాశాలలు, రైతు వేదికలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వసతి గృహాలతో పాటు అన్నింటికీ త్రాగునీరు అందించాలని తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని అంతర్గత రహదారులు, కల్వర్టులు ఇతర నిర్మాణ పనులను నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. జిల్లాలో పండ్లు, కూరగాయలు ఇతరత్రా ప్రత్యామ్నాయ పంటల సాగులో రైతులను ప్రోత్సహిస్తూ, పంట సాగులో మెళకువలు అందించాలని తెలిపారు. విద్యార్థులకు డిజిటల్ తరగతులు అందించడంతో పాటు బడిబాట కార్యక్రమం లో భాగంగా బడి బయట పిల్లలు, బడి మానేసిన వారిని తిరిగి పాఠశాలకు హాజరయ్యేలా అధికారులు చొరవ చూపాలని, ప్రతి పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం వెంటనే అమలు అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలో ప్రతి గ్రామానికి త్రీఫేజ్ విద్యుత్ సరఫరా అందించే విధంగా సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో జిల్లాలో ఆయా శాఖలకు నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. అభివృద్ధి సంక్షేమ రంగాలలో జిల్లాను ముందంజలో ఉంచే విధంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి – కొమురంభీం ఆసిఫాబాద్ చే జారీ చేయబడినది.

Share This Post