Asifabad : పల్లెప్రగతి అభివృద్ధి పనులను అధికారులు సమన్వయంతో పూర్తిచేయాలి : జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

5వ విడత పల్లెప్రగతి కార్యక్రమ అభివృద్ధి పనులను అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని వడేపల్లి గార్డెన్లో ఏర్పాటుచేసిన సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వరుణ్ రెడ్డి, ఆసిఫాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు ఆత్రం సక్కుతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ స్థాయి నుండి అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఈ నెల 18వ తేదీ వరకు నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించే విధంగా అధికారులు కృషి చేయాలని తెలిపారు. ప్రతి మహిళ ఆత్మవిశ్వాసంతో బ్రతికేందుకు మహిళా సంఘాల ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు రుణ సదుపాయం కల్పిస్తూ ప్రోత్సహించడం జరుగుతుందని, జిల్లాలోని 97 మహిళా సంఘాల సభ్యులు పల్లెప్రగతి కార్యక్రమంలో పాల్గొని పారిశుధ్యం పై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. పోషకాహారం, చిరుధాన్యాల వినియోగంపై తెలియజేసి పోషకాహార లోపాన్ని అధిగమించడంతో పాటు రక్తహీనత సమస్యను జిల్లా నుండి పూర్తిస్థాయిలో తొలగించే విధంగా ప్రజలను చైతన్య పరచాలని తెలిపారు. మహిళా సంఘాల సభ్యులు చిరుధాన్యాలను వినియోగించడంతో పాటు ప్రతి ఒక్కరు ఉపయోగించే విధంగా గ్రామస్థాయిలో వివరించాలని, కిరాణా దుకాణాలలో చిరుధాన్యాలను అందుబాటులో ఉంచే విధంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలోని 973 అంగన్వాడీ కేంద్రాలలో రాగి లడ్డు, రాగి జావ, జొన్న రొట్టె తదితర పోషకాహారాన్ని అందించే విధంగా అధికారులు చొరవ చూపాలని సూచించారు. బాల్య వివాహాలు, వరకట్నం, గృహ హింస తదితరాలపై ప్రజలలో అవగాహన పెంపొందించాలని తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, గ్రామాలలో ఎక్కడ కూడా చెత్త లేకుండా పరిశుభ్రంగా ఉంచేందుకు ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. జిల్లాలో సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధించడం జరిగిందని, అమలయ్యే విధంగా జిల్లాస్థాయిలో చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రతి ఇంటి నుండి సామాజిక అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనే విధంగా ముందుకు రావాలని తెలిపారు. దళితుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం చేపట్టిన దళిత బంధు మొదటి విడత కార్యక్రమంలో లబ్ధిదారులకు వారు ఎంచుకున్న యూనిట్లను పంపిణీ చేయడం జరిగిందని, ప్రభుత్వ ఆదేశానుసారం ప్రక్రియ కొనసాగించడం జరుగుతుందని తెలిపారు.

అంతకు ముందు జిల్లాలోని బ్యాంకర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులకు రుణాలు మంజూరు ప్రక్రియలో అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, ఆర్థిక సంవత్సరానికి గాను నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. దళిత బంధు పథకం లో భాగంగా ఎంపిక చేసిన లబ్ధిదారులకు వారి యూనిట్లకు అనుగుణంగా రుణాలు మంజూరు చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి, వివిధ శాఖల జిల్లా అధికారులు, వివిధ బ్యాంకుల అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి – కొమురంభీం ఆసిఫాబాద్ చే జారీ చేయబడినది.

Share This Post