Asifabad : ప్రజావాణి సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

ప్రజావాణిలో సమస్యల పరిష్కారం కోసం అభ్యర్థులు చేసుకున్న దరఖాస్తులపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనం లో గల కలెక్టర్ చాంబర్లో అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఆసిఫాబాద్ మండల కేంద్రంలోని భాగ్యనగర్ కాలనీకి చెందిన డి. రాము తాను ఎస్.సి. కులమునకు చెందిన వాడనని, ప్రభుత్వం అందిస్తున్న దళిత బంధు పథకం కింద తనకు టాటా మ్యాజిక్ వాహనం ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. ఆసిఫాబాద్ మండలం సాలెగూడ గ్రామానికి చెందిన ఎం.రమాదేవి తన భర్త మరణించి ఏడు సంవత్సరాలు అవుతుందని, తన పిల్లలను పోషించుకునేoదుకు వితంతు పింఛన్ మంజూరు చేయాలని కోరుతూ అర్జీ సమర్పించారు. ఆసిఫాబాద్ మండలం దస్నాపూర్ గ్రామానికి చెందిన ఎమ్.బైనాబాయి సమర్పించిన దరఖాస్తులో తన భర్త మద్యానికి బానిసై అనేక విధాలుగా వేధిస్తున్న కారణంగా తాను వేరుగా ఉంటున్నానని, తనకు ఒంటరి మహిళ పింఛన్ ఇప్పించాలని కోరారు. రెబ్బెన మండలం వంకుళం గ్రామపంచాయతీకి చెందిన పి.బాలాజీ, పాలె శంకర్ తాము రెబ్బెన మండలం రాళ్ల పేట గ్రామ శివారులో భూమి కొనుగోలు చేశానని, అట్టి భూమిని తమ పేరుపై పట్టా చేయాలని కోరుతూ వేరువేరుగా దరఖాస్తులు సమర్పించారు. తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్ డైలీ వేజ్, అవుట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్ లో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో అందిన దరఖాస్తులను ఆయా శాఖల అధికారులు సంబంధితశాఖల సమన్వయంతో పరిష్కరించేందుకు కృషి చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి – కొమురంభీం ఆసిఫాబాద్ చే జారీ చేయబడినది.

Share This Post