Asifabad : ప్రజావాణి సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

ప్రజావాణి లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సమస్యలను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనం లో గల కలెక్టర్ చాంబర్లో అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. సిర్పూర్ (టి) మండల కేంద్రానికి చెందిన ఎం. ఎ. సలీం 2016లో ప్రభుత్వం చేపట్టిన పంచాయితీ కార్యదర్శుల నియామకంలో తనకు రావలసిన ఉద్యోగం వేరొకరు చేస్తున్నారని, దీనిపై విచారణ జరిపి న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు సమర్పించారు. కాగజ్ నగర్ మండల కేంద్రానికి చెందిన బీతి విజయ్ కుమార్ తాను వికలాంగుడినని, డిగ్రీ పూర్తి చేసి కంప్యూటర్ కోర్సు నేర్చుకున్నానని, ఎలాంటి ఆధారం లేని తనకు ఉద్యోగ అవకాశం కల్పించి ఆదుకోవాలని కోరుతూ అర్జీ సమర్పించారు. ఆసిఫాబాద్ మండలం టి.ఆర్. నగర్ ప్రాంతానికి చెందిన సయ్యద్ రిజ్వాన అంజుమ్ నిరుపేదరాలైన తనకు ఇంటి స్థలం మంజూరు చేసి ఆదుకోవాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. కౌటాల మండలానికి చెందిన కొడ్పా రామచందర్ ఎస్. టి. గోండు కులానికి చెందిన తాను కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నానని, మూడు ఎకరాల భూమి కేటాయించినట్లు అయితే వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తానని, భూమి మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలోని కొండపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని బుద్ధనగర్ గ్రామస్తులు ఇదే గ్రామంలో 13 సంవత్సరాలుగా నివాస ఉంటున్నామని, మిషన్ భగీరథ పథకంలో భాగంగా త్రాగునీటి నల్లా కనెక్షన్లు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పర్యవేక్షించి త్వరితగతిన పరిష్కరించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి – కొమురంభీం ఆసిఫాబాద్ చే జారీ చేయబడినది.

Share This Post