ప్రభుత్వం బ్యాంకుల ద్వారా అందిస్తున్న రుణ సదుపాయాన్ని అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని వడేపల్లి గార్డెన్ లో ఏర్పాటు చేసిన బ్యాంకుల ఔట్ రీచ్ ఈ కార్యక్రమానికి ఆర్. ఎమ్., ఎల్. డి. ఎమ్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి, బ్యాంకర్లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్థిక చేయూత అందించే విధంగా బ్యాంకుల ద్వారా స్వయం సహాయక సంఘాలకు, వ్యాపార అభివృద్ధికి వివిధ రకాలుగా రుణ సదుపాయం కల్పిస్తుందని తెలిపారు. ఫైనాన్స్ సంస్థలు, ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద రుణాలు తీసుకుని నష్టపోకుండా బ్యాంకుల నుండి స్వల్ప వడ్డీపై రుణాలు పొంది ఆర్థికంగా ఎదగాలని అన్నారు. ప్రతి ఒక్కరూ రుణం పొందేందుకు తమ ఖాతాలను పునరుద్ధరించుకోవాలని, బ్యాంకు నిబంధనల ప్రకారం సామాన్య ప్రజలకు సైతం రుణాలను అందించడం జరుగుతుందని తెలిపారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు ప్రభుత్వం అందిస్తున్న పి.ఎమ్.జె.జె.బి.వై., ఎస్.బి.వై., ఎ.పి.వై. పథకాలలో తమ వివరాలు నమోదు చేసుకోవాలని తెలిపారు. స్వయం సహాయక సంఘాల సభ్యుల ఆర్థిక ఎదుగుదల కోసం గత ఆర్థిక సంవత్సరంలో 170 కోట్ల రూపాయల రుణాలను అందించడం జరిగిందని, జిల్లా సమాఖ్య సభ్యులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. వ్యాపార అభివృద్ధిపై దృష్టి సారించి రుణ సౌకర్యం పొందడం ద్వారా వివిధ రకాలైన యూనిట్లను నెలకొల్పి ఉత్పత్తుల ఉత్పాదకతను పెంపొందించుకోవాలని, తీసుకున్న రుణాలను ప్రతి నెల క్రమం తప్పకుండా తిరిగి చెల్లించాలని సూచించారు. వ్యవసాయ సాగును ప్రోత్సహిస్తే రైతులకు రుణాలు, రైతుబంధు కల్పించడం జరిగిందని, జిల్లా అభివృద్ధిలో భాగంగా అర్హులైన ఉద్యోగులకు గృహ రుణాలు అందించాలని తెలిపారు. వివిధ బ్యాంకులకు కేటాయించిన నిర్దేశిత లక్ష్యాలను సాధించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం మహిళా సంఘాల సభ్యులకు ప్రశంసాపత్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో వివిధ బ్యాంకుల అధికారులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి – కొమురంభీం ఆసిఫాబాద్ చే జారీ చేయబడినది.