Asifabad : మాత, శిశు మరణాల నియంత్రణ దిశగా ప్రత్యేక చర్యలు : జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

జిల్లాలో మాత శిశు మరణాలు తగ్గించడం కోసం పూర్తి స్థాయిలో నియంత్రణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ చాహత్ బాజ్ పాయితో కలిసి జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మాత శిశువు మరణాలను నియంత్రించడం కోసం వైద్యాధికారులు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ పూర్తి స్థాయిలో సేవలు అందించాలని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని గర్భిణుల వివరాలను నమోదు చేసుకునే విధంగా ప్రజలలో అవగాహన కల్పించాలని, గర్భిణీలకు ప్రతినెల స్కానింగ్, అవసరమైన పరీక్షలను నిర్వహిస్తూ సుఖ ప్రసవం అయ్యే విధంగా వైద్యాధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆసుపత్రులలో సాధారణ ప్రసవాలు జరిగే విధంగా వైద్యాధికారులు చర్యలు తీసుకోవడంతో పాటు సిజేరియన్ ప్రసవాలను పూర్తిస్థాయిలో తగ్గించాలని తెలిపారు. గర్భిణుల ఆరోగ్య దృష్ట్యా రక్తహీనత సమస్య లేకుండా అవసరమైన మందులను అందిస్తూ తీసుకోవలసిన పౌష్టికాహారాన్ని సూచించాలని తెలిపారు. గ్రామాలలో పారిశుధ్య నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని, రహదారులు, మురుగు కాలువలు, నివాస ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. గ్రామాలలో ఎక్కడ కూడా నీరు నిల్వ ఉండకుండా చూడాలని, తద్వారా దోమల వృద్ధిని అరికట్టవచ్చని, వి.ఆర్.ఓ.లు, వి.ఆర్.ఎ.లు, ఆశ కార్యకర్తలు, వైద్య సహాయకులు గ్రామాలలో సీజనల్ వ్యాధులు, విష జ్వరాల నియంత్రణ, వ్యాధులు ప్రబాలకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని తెలిపారు. బహిరంగ తినుబండారాలు, కలుషిత ఆహారం తీసుకోకుండా పౌష్టికాహారాన్ని తీసుకుంటూ, కాచి చల్లార్చి వడపోసిన నీటిని త్రాగే విధంగా ప్రజలకు వివరించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ప్రభాకర్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి – కొమురంభీం ఆసిఫాబాద్ చే జారీ చేయబడినది.

Share This Post