Asifabad : మానవ హక్కులు ప్రతి ఒక్కరి జీవితంలో భాగమే : తెలంగాణ మానవ హక్కుల కమీషన్‌ చైర్మన్‌ జి.చంద్రయ్య

మానవ హక్కుల గురించి తెలుసుకోవడం ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగమేనని తెలంగాణ మానవ హక్కుల కమీషన్‌ చైర్మన్‌ జి.చంద్రయ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ రాజేశం, జిల్లా అటవీ అధికారి శాంతారామ్, అదనపు ఎస్.పి. (అడ్మిన్) అచ్చేశ్వరరావుతో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మానవ హక్కుల కమీషన్‌ చైర్మన్‌ మాట్లాడుతూ, మానవ హక్కుల గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని అన్నారు. ప్రసార, ప్రచార మాధ్యమాల ద్వారా మానవ హక్కులపై విసృత ప్రచారం నిర్వహించాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 2019లో మొట్టమొదటి సారిగా మానవ హక్కుల కమీషన్‌ సమావేశం నిర్వహించడం జరిగిందని, తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమీషన్‌ అనేది రాష్ట్ర జాబితా, ఏడవ షెడ్యూల్‌లో పేర్కొన్న ఉమ్మడి జాబితాలో సూచించిన విషయాల కోసం మానవ హక్కుల ఉల్లంఘనల పై విచారణ చేయడానికి భారతదేశానికి 1993 మానవ హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం రూపొందించబడిందని అన్నారు. రెవెన్యూ, మున్సిపల్‌, పోలీసు, పంచాయతీరాజ్‌ శాఖలతో పాటు షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి, వెనుకబడిన తరగతుల సంక్షేమం, వయోజన విద్య, వైద్య-ఆరోగ్య, గ్రామీణ నీటి సరఫరా విభాగం, విద్యుత్‌, విద్య ఇతరత్రా శాఖల సమస్యల పరిష్కారంలో పారదర్శకంగా వ్యవహరించాలని పలు సూచనలు, సలహాలు చేశారు. ప్రతి మనిషి ఇతరులను ఇబ్బంది పెట్టకుండా జీవించాలని, ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజల అవసరాలు, అభిప్రాయాలు, నాగరికత ప్రకారం ఏర్పాటు చేసుకున్న చట్టాలను అందరు అనుసరించాలని తెలిపారు. న్యాయవ్యవస్థలో కేసుల ఆధారంగా వివిధ స్థాయిలలో వివిధ న్యాయస్థానాలలో విచారించడం జరుగుతుందని, కేసులపై క్షుణ్ణంగా విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ సేవలు అందించడంలో జిల్లా డివిజన్‌, మండలం, గ్రామాల స్థాయిలలో సంబంధిత అధికారుల పర్యవేక్షణలో పూర్తి స్థాయిలో పని చేయడం జరుగుతుందని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం పారదర్శకంగా పని చేయాలని, సమస్యల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే వారికి జవాబుదారితనంతో వ్యవహరిస్తూ పరిష్కారం దిశగా కృషి చేయాలని తెలిపారు. రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరు సమానంగా హక్కులు కలిగి ఉంటారని, ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి అందరికీ న్యాయం చేయడంలో రెట్టింపు బాధ్యత ఉంటుందని, అధికారులు సమిష్టిగా సమస్య పరిష్కారం దిశగా కృషి చేయాలని తెలిపారు. మానవ హక్కుల గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని, ప్రతి అంశంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, మానవ హక్కులకు సంబంధించి 511 సెక్షన్లు ఉన్నాయని, వాటిని పూర్తి స్థాయిలో తెలుసుకోవాలని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల ఫలాలను అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగపర్చుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి – కొమురంభీం ఆసిఫాబాద్ చే జారీచేయబడినది.

Share This Post