Civil Supplies Department.

తెలంగాణ ప్రభుత్వం

పౌరసరఫరాల శాఖ కార్యాలయం

సోమాజిగూడ, హైదరాబాద్ –500082

పత్రిక ప్రకటన :                                                               తేదీ: 03.06.2021

బియ్యం రవాణాలో వేగం పెంచాలి

నాణ్యతలో రాజీ పడొద్దు

పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి

కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో పేదలకు కడుపునిండా భోజనం అందించాలన్న సదుద్దేశంతో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖరరావుగారి ఆదేశాల మేరకు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సూచన మేరకు ఈ నెల 5వ తేదీ నుండి రేషన్ షాపుల ద్వారా పేదలకు ఉచితంగా బియ్యం పంపిణీకి కావాల్సిన చర్యలు చేపట్టాలని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎలాంటి జాప్యానికి తావులేకుండా ఈ నెల 4వ తేదీలోగా గోదాముల నుండి రేషన్‌షాపులకు బియ్యాన్ని చేరవేయాలని అన్నారు. ఉచిత బియ్యం పంపిణీ పై గురువారంనాడు పౌరసరఫరాల భవన్లో పిడిఎస్ విభాగం అధికారులతో సమీక్షించారు. సమావేశంలో జాయింట్ కమిషనర్ ఉషారాణి, డిప్యూటీ కమిషనర్ పద్మజ, అసిస్టెట్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, పౌరసరఫరాల సంస్థ జనరల్ మేనేజర్ రాజారెడ్డి, పిడిఎస్ డిప్యూటీ మేనేజర్ మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.

ఆశించిన స్థాయిలో బియ్యం రవాణా జరగడం లేదని సమావేశంలో ఛైర్మన్ గారు అసంతృప్తి వ్యక్తం చేశారు. రవాణాలో ఎందుకు జాప్యం జరుగుతోందని అధికారులను ప్రశ్నించారు. 87.54 లక్షల కుటుంబాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి 15 కిలోల చొప్పున 4,03,911 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమవుతాయని, 3వ తేదీ వరకు కూడా అన్ని రేషన్‌షాపులకు చేరుకోక పోవడం ఏమిటీ అని ప్రశ్నించారు. ఎంత ఆర్థికభారమైన కూడా పేదలకు ఉచితంగా బియ్యం అందించడానికి వేల కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నారు. ఈ బియ్యం కోసం పేదలు ఎదురు చూడాల్సిన పరిస్థితులు తీసుకురావద్దన్నారు. ట్రాన్స్ పోర్టు కంట్రాక్టర్లతో మాట్లాడి అదనపు వాహనాలను సమకూర్చుకుని రవాణాను వేగవంతం చేయాలని సూచించారు. ఉమ్మడి కరీంనగర్, రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాలను జాయింట్ కమిషనర్ పర్యవేక్షించాలని, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలను డిప్యూటీ కమిషనర్ పర్యవేక్షించాలని సూచించారు. బియ్యం నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడొద్దని అధికారులకు సూచించారు. ఉచిత బియ్యం పక్కదారి పట్టకుండా అర్హులైన పేదలకు అందేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

డిజిపికి విజ్ఞప్తి :

కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో ఈ నెల 5వ తేదీ నుంచి ఉదయం 6 గంటల నుంచి 2 గంటల వరకు రేషన్ షాపులు తెరిచే ఉంటాయని అన్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రేషన్‌షాపుల వద్ద ఎక్కువ మొత్తం లబ్ధిదారులు గుమికూడకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిజిపి మహేందర్ రెడ్డి గారికి ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రతి లబ్ధిదారుడికి బియ్యం అందిస్తామని ఎవరూ ఎలాంటి అందోళన చెందకుండా క్రమపద్ధతితో వచ్చి రేషన్ తీసుకోవాలని లబ్ధిదారులకు విజ్ఞప్తి చేశారు.

బియ్యం పంపిణీ చేశాక మిగిలిన గన్నీ సంచులను తప్పని సరిగా పౌరసరఫరాల సంస్థకు విక్రయించాలని రేషన్ డీలర్లను ఆదేశించారు. జూన్ ఉచిత బియ్యం పంపిణీ వల్ల 80 లక్షల గన్నీ సంచులు డీలర్ల దగ్గర మిగిలిపోయాయని, ఈ గన్నీ సంచులను పౌరసరఫరాల సంస్థకు విక్రయించేలా అదనపు కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్ నుండి ఒక్కో గన్నీ సంచి ధరను రూ.18 నుండి రూ.21కి పెంచడం జరిగింది. రేషన్ డీలర్లు గన్నీ సంచులను పౌరసరఫరాల సంస్థకు అప్పగించిన తరువాత వారం రోజుల్లో చెల్లింపులు జరపాలని జిల్లా మేనేజర్లను ఆదేశించారు.

నోట్ : సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్            మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి

పౌరసరఫరాల శాఖ కార్యాలయం నుంచి జారీచేయబడినది.

 

Share This Post