Civil Supplies Department

తెలంగాణ ప్రభుత్వం

పౌరసరఫరాల శాఖకార్యాలయం

సోమాజిగూడ, హైదరాబాద్ 500082

పత్రిక ప్రకటన :                                                              తేదీ : 17.06.2021

రైతులకు వెన్ను దన్నుగా నిలిచిన సీఎం కేసీఆర్

ధాన్యం దిగుబడి, కొనుగోళ్లలో సరికొత్త చరిత్ర

ఈ ఏడాదిలో కోటి 40 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు

యాసంగిలో అంచనాలకు మించి కొనుగోలు

21 జిల్లాల్లో వందశాతంపైగా కొనుగోలు

ఏడేళ్లల్లో 576 శాతం పెరుగుదల

ఈ ఘనత సీఎం కేసీఆర్ గారి నిరంతర శ్రమ, దార్శనికత, దూరదృష్టి వల్లే సాధ్యమైంది

పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి

గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నిరంతర శ్రమ, మేధోమథనం, దార్శనికత, దూరదృష్టితో రైతాంగానికి వెన్నుదన్నుగా నిలవడం వల్లే నేడు తెలంగాణ ప్రభుత్వం వరిసాగు విస్తీర్ణం, దిగుబడుల్లో రికార్డులను సృష్టిస్తూ కొనుగోలులో సరికొత్త చరిత్రను సృష్టించిందని పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం నాడు పౌరసరఫరాల భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతుల ఆదాయాన్ని పెంచడానికి, వారి జీవితాల్లో సౌభాగ్యం నింపడానికి గడిచిన ఏడు సంత్సరాలుగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు సాధికారత కోసం నిరంతరం తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్రంలో వ్యవసాయరంగం ముఖచిత్రాన్నే మార్చివేసి ధాన్యం కొనుగోళ్లు, రైతులకు కనీస మద్దతు ధర చెల్లింపుల్లో తెలంగాణ యావత్ భారతదేశానికి దిక్సూచిగా నిలిచిందన్నారు.

కరోనా మహమ్మారి సృష్టించిన సంక్షోభ సమయంలోనూ రైతులు పొలాల్లో శ్రమించడం మానలేదు. ఏడాదిలో రికార్డుస్థాయిలో దాదాపు 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించారు. దశాబ్దాలపాటు సాగుకు నోచుకోని భూముల్లో సైతం వరిపంటను పండించారు. 70 ఏళ్ల ఉమ్మడి పాలనలో సాధ్యం కానిది ఏడు సంవత్సరాల్లో సాధ్యమైందని చెప్పడానికి గర్వపడుతున్నామన్నారు.

        ధాన్యం దిగుబడి, కొనుగోళ్లలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం కనీ వినీ ఎరుగని ప్రగతిని సాధించి దేశానికి దిక్సూచిగా నిలిచింది. 2014 – 15 సంవత్సరంలో వానాకాలం, యాసంగి రెండు పంటలు కలిపి తెలంగాణలో దాదాపు 35 లక్షల ఎకరాల్లో వరి పంటసాగయితే, ఈ ఏడాది 2020-21 లో కోటి 6 లక్షల ఎకరాల్లో వరి పంట సాగయింది. అప్పుడు పౌరసరఫరాల సంస్థ ఏడాదిలో వానాకాలం, యాసంగి రెండు పంటలు కలిపి 24.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తే , ఈ ఏడాది (2020-21)లో (వానాకాలంలో 49 లక్షలు, యాసంగిలో 90 లక్షలు) ఒక కోటి 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి చరిత్ర సృష్టించింది. 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎన్నడూ, ఎప్పుడూ, ఎక్కడా జరుగని విధంగా కేవలం ఏడు సంవత్సరాల్లో 576 శాతం కొనుగోళ్లు పెరిగాయి. ఒక్క యాసంగి సీజనను గమనిస్తే 2014-15లో 13.24 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే నేడు 90 లక్షలకు చేరింది. అంటే 587 శాతం కొనుగోళ్లు పెరిగాయన్నారు.

గత ఏడాది (2019-20) వానాకాలం, యాసంగి రెండు పంటలను కలిపి పౌరసరఫరాల సంస్థ ఒక కోటి 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలుచేయడం ఒక రికార్డు కాగా, ఇప్పుడు దాన్ని అధగమించి సరికొత్త రికార్డును సృష్టించింది. ఈ ఏడాది (2020-21) యాసంగిలో అంచనాలకు మించి ధాన్యాన్ని కొనుగోలు చేశాం.

వ్యవసాయశాఖ,జిల్లా అధికారుల నుంచి వచ్చిన నివేదిక ప్రకారం 70 నుండి 80 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు అంచనా పెట్టుకున్నం.గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు అదనంగా వచ్చిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేశాం. యాసంగిలో ధాన్యం కొనుగోళ్లు ముగింపుదశకు చేరుకున్నాయి

        ఇప్పటి వరకు 6,967 కొనుగోలు కేంద్రాల ద్వారా 14.21 లక్షల మంది రైతుల నుండి 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. ప్రధానంగా సూర్యాపేట, మహబూబ్ నగర్, సంగారెడ్డి, నారాయణపేట, వికారాబాద్, గద్వాల్ జిల్లాల్లో గత ఏడాది యాసంగి కంటే ఈసారి 63శాతం నుండి 114 శాతం వరకు కొనుగోళ్లు పెరిగాయి. దాదాపు 25 జిల్లాల్లో కొనుగోళ్ల ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. కేవలం 50 నుండి లక్ష వరకు ధాన్యం వచ్చే అవకాశం ఉందన్నారు.

32 జిల్లాలకుగాను 21 జిల్లాల్లో వందశాతం పైగా ఇప్పటి వరకు రూ.16,878 కోట్లు విలువ చేసే ధాన్యం కొనుగోలు చేశాం. రైతులకు రూ.13,753 కోట్లు చెల్లించాం, కేవలం గురువారం ఒక్కరోజే 2వేల కోట్లు విడుదల చేయడం జరిగింది. రైస్ మిల్లర్లు, వ్యాపారస్తులు 15 నుండి 20 లక్షల వరకు కొనుగోలు చేశారన్నారు.

ఇది సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వ విజయం ….

ఒకవైపు లక్ష్యానికి మించి ధాన్యం కొనుగోలు చేయాల్సిరావడం…మరోవైపు కరోనా విజృంభించడం… లాక్ డౌన్ విధించడం… హమాలీలు, డ్రైవర్లు, లారీల కొరత ఏర్పడటం.. డిమాండ్ కు అనుగుణంగా మిల్లింగ్ సామర్థ్యం లేకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాలు…. మార్గదర్శకాలకు అనుగుణంగా పనిచేసి రైతాంగానికి ఇబ్బందులు కలగకుండా విజయవంతంగా ధాన్యం కొనుగోళ్లను పూర్తి చేశాం. ఇది సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వ విజయమే అన్నారు.

అంచనాలకు మించి ధాన్యం వచ్చినా ఎక్కడ కూడా నిధుల కొరతగానీ, గన్నీ సంచుల కొరత లేకుండా చర్యలు తీసుకున్నాం. స్థానికంగా మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, జెడ్పీఛైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు స్థానికంగా ధాన్యం కొనుగోళ్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. అలాగే జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పౌరసరఫరాలు, రెవెన్యూ, రవాణా, డిఆర్‌డిఎ, డిసివో అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో వ్యవసాయ, మార్కెటింగ్ అధికారుల సమన్వయంతో ముందుకు సాగామన్నారు.

        పౌరసరఫరాల శాఖ కమిషనర్ శ్రీ అనిల్ కుమార్ గారు అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుంటూ ధాన్యం కొనుగోళ్లను పర్యవేక్షించారు. అలాగే పౌరసరఫరాల శాఖ, పౌరసరఫరాల సంస్థ ఉన్నతాధికారులు చాలా బాగా పనిచేశారు. ఎక్కడ సమస్యలు ఎదురైనా వాటిని అధిగమించడానికి కావాల్సిన చర్యలు చేపట్టారు. యాసంగిలో ధాన్య సేకరణను విజయవంతం చేయడానికి పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ గారు, వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి గారు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేష్ కుమార్ గారి సలహాలు, సూచనలు, సహకారం ఎంతో ఉంది. వారికి పౌరసరఫరాల సంస్థ తరపున కృతజ్ఞతలు తెలిపారు.

చరిత్రలో అత్యధికంగా కోటి టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు చేసిన ప్రక్రియలో పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌గా భాగస్వామ్యం అయ్యే అవకాశం వచ్చినందుకు గర్వంగా ఉంది. దేశానికి అన్నం పెడుతున్న రైతన్నకు సేవ చేసే అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ. కే. చంద్రశేఖరరావు గారికి జీవితకాలం ఋణపడి ఉంటానని తెలిపారు.

నోట్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుండి ధాన్యం కొనుగోలు వివరాలను మీడియాకు వివరిస్తున్నపౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి

పౌరసరఫరాల శాఖ కార్యాలయం నుంచి జారీచేయబడినది.

Share This Post