తెలంగాణ ప్రభుత్వం
పౌరసరఫరాల శాఖ కార్యాలయం
సోమాజిగూడ, హైదరాబాద్ 500082
పత్రిక ప్రకటన : తేదీ : 19.06.2021
ఏడేండ్లలో రూ.88వేల కోట్ల విలువ చేసే
5 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
యాదాద్రి జిల్లా వాసాలమర్రిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన
పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశఖరరావు గారి ఆదేశాలమేరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014-15 నుండి ఇప్పటి వరకు దాదాపు 5 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు రైతుల నుంచి కొనుగోలు చేశామని పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ శ్రీ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. దీని విలువ రూ.88వేల కోట్ల వరకు ఉంటుందన్నారు. దేశంలో ఈ విధంగా ధాన్యం కొనుగోలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అన్నారు.
శనివారం నాడు యాదాద్రి భువనగిరిజిల్లా వాసాలమర్రిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డి. సీ సీ బి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి తో కలిసి పరిశీలించారు. 2014-15 నుండి 2019-20 వరకు ధాన్యం కొనుగోలు చేసిన ఐకెపి, పిఎసిఎస్, డిసిఎంఎస్ లతో పాటు జిసిసి, హాకా వంటి ఇతర ఏజెన్సీలకు రూ. 1029 కోట్ల కమీషన్ ఇవ్వడం జరిగిందని తెలిపారు.
యాసంగికి సంబందించి రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు ప్రక్రియ ముగింపు దశకు చేరుకుందని ఇప్పటి వరకు 90.25 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామని ఇంకా 50 వేల వరకు వచ్చే అవకాశం ఉందన్నారు.
కొనుగోళ్ల ప్రక్రియ ముగిసిన జిల్లాల్లో ఆయా జిల్లా అధికారులు ప్యాడీ, గన్నీ రికన్సిలేషన్ పై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.
పౌరసరఫరాల శాఖ కార్యాలయం నుంచి జారీచేయబడినది.