DPRO ADB – అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి టీకా మందు పంపిణి చేయాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

కోవిడ్ వ్యాక్సినేషన్ వేగవంతం చేసి లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ వైద్య, మున్సిపల్, పంచాయితీ అధికారులను ఆదేశించారు. సోమవారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో కోవిడ్ వ్యాక్సినేషన్ పై వైద్య, మున్సిపల్, పంచాయితీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇప్పటివరకు మొదటి డోస్ కూడా తీసుకోని వారికీ ఇప్పించాలని, మొదటి డోస్ తీసుకొని రెండవ డోస్ సమయానికి వేయాలని, అందుకు ఇంటింటి సర్వేతో పాటు వ్యాక్సిన్ అందించాలని అన్నారు. ముఖ్యంగా పట్టణప్రాంతంలో మెప్మా, మున్సిపల్, వైద్య సిబ్బంది ద్వారా అన్ని వార్డులోని ఇంటింటి సర్వే నిర్వహించాలని, ఏరోజుకారోజు సర్వే ప్రకారం వ్యాక్సిన్ తీసుకోని వారికీ తప్పనిసరిగా అందించాలని అన్నారు. ప్రజలను చైతన్యపరుస్తూ వందశాతం వ్యాక్సిన్ అందించిన జిల్లాగా అన్ని శాఖల సమన్వయంతో లక్ష్యాలను సాధించాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 5,48,094 మందికి వ్యాక్సిన్ అందించాల్సి ఉండగా ఆదివారం నాటికీ 3,87,616 (70.72%) మందికి మొదటి డోస్, 99,091 (80.48%) రెండవ డోస్ అందించడం జరిగిందని తెలిపారు. పట్టణప్రాంతంలో మరింత అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రతి ఒక్కరికి టీకామందు అందించాలని అన్నారు. అందుకు తగిన ప్రణాళికలను సిద్ధం చేయాలనీ రానున్న రెండుమూడు రోజులలో లక్ష్యాలను సాధించాలని అన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.నరేందర్ రాథోడ్, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.సాధన, జిల్లా పంచాయితీ అధికారి శ్రీనివాస్, మున్సిపల్ కమీషనర్ శైలజ, ప్రోగ్రాం ఆఫీసర్ డా.నవ్య, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా.విజయ సారధి, మెప్మా DMC శ్రీనివాస్, ఇతర వైద్య, మెప్మా సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Share This Post