DPRO ADB-ఆదిలాబాద్ పట్టణంలో పారిశుధ్యం, పచ్చదనం లను నిర్వహిస్తూ సుందరంగా తీర్చి దిద్దుదాం – స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.

ఆదిలాబాద్ పట్టణంలో పారిశుధ్యం, పచ్చదనం లను నిర్వహిస్తూ సుందరంగా తీర్చిదిద్దే కార్యక్రమాలలో ప్రజల భాగస్వామ్యం అవసరమని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. 4వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగ వార్డ్ నెం.38 కైలాస్ నగర్ లో గల కమ్యూనిటీ హాల్ లో నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, 15 రోజుల పాటు జరిగే పట్టణ ప్రగతి కార్యక్రమాలలో వార్డులలోని ప్రజలు పాల్గొని కాలనీల సమస్యలు తెలుపడం, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలలో భాగస్వాములు కావాలని అన్నారు. కాలనీ వాసులు తెలిపిన ప్రకారంగా ఐరన్ పోల్స్, వంగిపోయిన, చెడిపోయిన విద్యుత్ పోల్స్ ల స్థానంలో కొత్తవాటిని ఏర్పాటు చేయాలని, ఎస్టిమేట్స్ సిద్ధం చేయాలని ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు. పారిశుధ్య పనులకు పారిశుధ్య సిబ్బందిని కేటాయిస్తామని తెలిపారు. పట్టణంలో ఖాళీస్థలాల వివరాలు, ఆ యజమాని వివరాలు తెలియజేయాలని, ఆ స్థలంలో ఉన్న చెత్తను, పిచ్చి మొక్కలను తొలగించే విధంగా నోటీస్ లు జారీచేస్తామని, అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. పట్టణంలో హరితహారం క్రింద 5.50 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందని, ప్రతి ఇంటి ముందు మొక్కలను నాటి సంరక్షించాలని అన్నారు. మునిసిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ, పట్టణంలోని కాలనీలలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని, ప్రజల భాగస్వామ్యం అవసరమని అన్నారు. కాలనీలలో సిసి రోడ్లు, మురికి కాలువలు, ఓపెన్ జిమ్, పార్కులు, ట్రీ పార్కులు, క్రీడా ప్రాంగణాలు, సమీకృత వెజ్-నాన్ వెజ్ మార్కెట్, వంటివి ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అంతకు ముందు 2 కోట్లతో స్టేడియం పనులకు భూమిపూజ నిర్వహించి, కాలనీలో పాదయాత్ర నిర్వహించి మురికి కాలువల పనులను పరిశీలించారు. కాలనీలలో ని సమస్యలను సీనియర్ సిటీజన్లు, కాలనీ వాసులు, సమస్యలను సమావేశములో తెలిపారు. పట్టణ ప్రగతి కార్యక్రమానికి ముందు అధికారులు, ప్రజా ప్రతినిధులు, వార్డ్ సీనియర్ సిటీజన్లు మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమీషనర్ శైలజ, కౌన్సిలర్ అర్చన, వైస్ చైర్మన్ జహీర్ రంజాని, వార్డ్ ప్రత్యేక అధికారి రాథోడ్ రామారావు, మునిసిపల్, విద్యుత్ అధికారులు, ప్రజాప్రతినిధులు, వార్డ్ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post