DPRO ADB- ఆదివాసీ సంప్రదాయ వంటకాలు, ఆచారాలను భవిష్యత్తు తరాలకు అందించాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

ఆదివాసీ సంప్రదాయ వంటకాలు, ఆచారాలను భవిష్యత్తు తరాలకు అందించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం సిరికొండ మండలం, రిమ్మ గ్రామంలో నిర్వహించిన ఇప్ప పువ్వు పండగ కార్యక్రమంలో ఐ టి డి ఏ పి ఓ అంకిత్, అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ లతో కలిసి ఆమె పాల్గొన్నారు. ముందుగా గిరిజన సంప్రదాయ నృత్యాలతో కలెక్టర్ కు గ్రామ ప్రజలు స్వాగతం పలికారు. అధికారులతో కలిసి ఆమె మొక్కలు నాటారు. ఇప్ప చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించి, ఇప్ప పువ్వు పండగ సందర్బంగా ఏర్పాటు చేసిన గిరిజన సంప్రదాయ వంటకాలను పరిశీలించారు. మక్క గారెలు, జొన్న గట్క, ఇప్ప పువ్వుతో చేసిన వంటకాలను రుచి చూసారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ, ఆదివాసీ గిరిజన సాంప్రదాయ వంటకాలను భవిష్యత్ తరాలకు అందించేలా కృషి చేయాలని అన్నారు. ప్రతి సంవత్సరం ఇప్ప పువ్వు వంటల పండగను నిర్వహించి, అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు, గర్భిణులకు, బాలింతలకు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందని, త్వరలోనే మంజూరుకు కృషి చేస్తామని, సెల్ టవర్ ఏర్పాటుకు చర్యలు చేపడతామని తెలిపారు. అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేస్తామని అన్నారు. జొన్న గట్క, మక్క గారెలు, ఇప్ప పువ్వు లడ్డు ఇతర వంటలు చాలా బాగున్నాయని, హైదరాబాద్, నాగపూర్ వంటి పట్టణాలకు మార్కెటింగ్ చేసేందుకు ఐటీడీఏ ద్వారా చర్యలు చేపడతామని తెలిపారు. రక్తహీనతను నివారించేందుకు ఇప్పపువ్వు వంటలు అంగన్వాడి కేంద్రాల్లో పంపిణీకి చర్యలు తీసుకుంటామన్నారు. మహిళలకు ఉపాధి కల్పించేందుకు ఇతర జిల్లాలో మార్కెటింగ్ చేసేందుకు ఐటీడీఏ ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని అన్నారు. జూన్ 3వ తేదీ నుండి ప్రారంభం కానున్న పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. గ్రామంలో పరిసరాల పరిశుభ్రత, హరితహారం లో మొక్కలు నాటడం, వైకుంఠ గ్రామాలు, రైతు వేదికలో విద్యుత్ సౌకర్యం, నీటి సరఫరా తదితర పనులను చేపట్టాలన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో చేపట్టనున్న పనులను సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి లు గ్రామ సభలు నిర్వహించి ప్రజలకు వివరించాలని సూచించారు. ఐటీడీఏ పీవో అంకిత మాట్లాడుతూ ఐటీడీఏ ద్వారా ఇప్పపువ్వు లడ్డు యూనిట్ ను ఉట్నూర్ లో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా రక్త హీనతతో బాధపడుతున్న పిల్లలకు, గర్భిణీలకు, మహిళలకు ఇప్పపువ్వు లడ్డు ను అందించడం ద్వారా రక్త హీనతను నివారించడం జరిగిందన్నారు. బాలికల కోసం ఆశ్రమ పాఠశాలలలో అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గిరిజన ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, ఐటిడిఎ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను వివరించేందుకు ప్రతి గ్రామంలో అవగాహనా కార్యక్రమాలు చేపడుతామని అన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ మాట్లాడుతూ గిరిజన ప్రజల సంప్రదాయాలు, ఆచారాలు అందరికి ఆదర్శమన్నారు. ఆదివాసి సాంప్రదాయ వంటలు పోషక లోపం ఉన్న పిల్లలకు అందించాలని అన్నారు. గ్రామంలో పల్లె ప్రకృతి వనం, వైకుంఠ ధామం, వివిధ సంక్షేమ పథకాల అమలుకు తీసుకుంటున్న చర్యలు బావున్నాయని సర్పంచ్ పంచాయతీ సెక్రెటరీ అభినందించారు. అనంతరం కలెక్టర్ ను, అధికారులను ఆదివాసీ పెద్దలు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆదిమ గిరిజనుల సలహా కమిటీ ఛైర్మెన్ లక్కే రావు, మహిళ కమిషన్ సభ్యురాలు ఈశ్వరీబాయి, ఉట్నూర్ ఎఫ్.డి.ఓ జాదవ్ రాహుల్, డిఎస్పీ హర్షవర్ధన్, అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Share This Post