DPRO ADB-ఆధునిక సాంకేతిక వ్యవసాయ పద్దతులను పాటించి లాభదాయక పంటలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్

ఆధునిక సాంకేతిక వ్యవసాయ పద్దతులను పాటించి లాభదాయక పంటలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. మంగళవారం మావల మండల కేంద్రంలోని రైతువేదికలో 2022 సంవత్సరానికి గాను వానాకాలం పంట సాగు యాజమాన్య పద్దతులపై వ్యవసాయ అధికారులకు, రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొన్నారు. ముందుగా వ్యవసాయ, ఉద్యానవన, ఆత్మా అధికారులు, శాస్త్రజ్ఞులు పత్తి, సొయా, శనగ, ఆయిల్ ఫామ్, కంది, తదితర పంటల సాగుకు తీసుకోవలసిన చర్యలపై వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఆధునిక సాంకేతిక పద్దతుల ద్వారా అధిక దిగుబడులను సాధించేలా రైతులను ప్రోత్సహించాలని సూచించారు. నకిలీ విత్తనాలతో నష్టపోకుండా రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని, పోలీస్, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో నకిలీ విత్తనాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ విస్తరణ అధికారులు రైతు వేదికల నుండి విధులు నిర్వహించాలని అన్నారు. ఎరువుల వాడకం, ప్రభుత్వ ప్రోత్సహాకాలు, ఆయిల్ ఫామ్, తదితర పంటల సాగు పై రైతులకు సాంకేతిక సలహాలు, అవగాహన కార్యక్రమాలు నిరంతరం రైతువేదికల నుండి నిర్వహించాలని అన్నారు. గ్రామాల వారిగా రైతుల వివరాలు, ఆధునిక, వ్యవసాయ, ఉద్యానవన పంటల సాగు వివరాలు, ఎరువుల వాడకం వంటి వివరాలను రైతువేదికలో ప్రదర్శించాలని అన్నారు. జిల్లాలో 2022-23 సంవత్సరానికి గాను వానాకాలం లో 1200 ఎకరాలు, యాసంగి లో 2200 ఆయిల్ ఫామ్ సాగు చేయాలనీ నిర్దేశించడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఎస్సీ, ఎస్టీ రైతులకు వందశాతం సబ్సిడీ, మిగితా రైతులకు 90 శాతం సబ్సిడీతో ఆయిల్ ఫామ్ మొక్కల సరఫరా, డ్రిప్, తదితర సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని 101 రైతువేదికల ద్వారా పంటల సాగు, యాజమాన్య పద్దతులపై రైతులకు వ్యవసాయ అధికారులు సూచనలు, సలహాలు అందించాలని అన్నారు. రైతు వేదికల వద్ద పరిసరాల పరిశుభ్రత పాటించాలని అన్నారు వచ్చే హరితహారం కార్యక్రమంలో రైతువేదికల వద్ద పచ్చదనం పెంపొందించేలా మొక్కలు నాటాలని, సర్పంచ్, పంచాయితీ కార్యదర్శుల సహకారం తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంత గ్రామాలలో గిరివికాసం ద్వారా రైతులకు బోర్ లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. వ్యవసాయ అధికారులు పంట రుణాల మంజూరుపై రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, లీడ్ బ్యాంకు మేనేజర్ చంద్రశేఖర్, వ్యవసాయ అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post