DPRO ADB – ఆర్.ఓ.ఎఫ్.ఆర్. క్లెయిమ్ ఫారాలలో పూర్తివివరాలు నమోదు చేసి స్వీకరించాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

పోడుభూములకు సంబంధించిన క్లెయిమ్ ఫారాలను స్వీకరించడంతో పాటు, లోటుపాట్లు లేకుండా నివేదికలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం రోజున తహసీల్దార్లు, అటవీ అధికారులు, ప్రత్యేక అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో పోడుభూములను సాగు చేస్తున్న వారు క్లెయిమ్ ఫారాలలో పూర్తీ వివరాలను నమోదు చేయడంతో పాటు, ఆధారాలు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు, కుల ధ్రువీకరణ పత్రాలు, జతచేయించి తీసుకోవాలని అన్నారు. జిల్లాలో 345 గ్రామపంచాయితీల పరిధిలలోని 728 ఆవాసాలలో పోడుభూములు సాగు చేస్తున్నట్లు నివేదికలు ఉన్నాయని, అదనంగా ఆదిమ ఆవాసాలు (PVTG), సాగు చేస్తున్న పోడుభూములకు సంబంధించిన వివరాలకు అదనపు షీట్ లలో నివేదికలు సమర్పించాలని అన్నారు. నివేదికలు సమ్పరించడంలో ఎలాంటి తప్పులు లేకుండా నిర్దిష్టమైన సమాచారంతో భూముల విస్తీర్ణంతో, నియమిత సమయం లోగా సమర్పించాలని అన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ, 98 ఆదిమ ఆవాసాలు క్రోడీకరించవలసి ఉందని అట్టి వాటికీ ఆయా తహసీల్దార్లు నివేదికలు వెంటనే సమర్పించాలని, ఆయా ఆవాసాలలో అటవీ హక్కుల కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. క్లెయిమ్ ఫారాలలో నమోదు చేస్తున్న భూముల విస్తీర్ణం ఎకరాలు, గుంటలు లలో నమోదు చేయాలనీ, ఇప్పటివరకు సమర్పించిన నివేదికలను కూడా సరిచేసి పంపించాలని అన్నారు. క్లెయిమ్ ఫారాలను సరైన క్రమంలో పూర్తివివరాలు నమోదు చేయడంతో పాటు కుటుంబ వివరాలు, భార్య కుల ధ్రువీకరణ పత్రాన్ని జతపరచాలని అన్నారు. అటవీ హక్కుల కమిటీ, గ్రామపంచాయితీ లలో నిర్వహించే తీర్మానాలను సరైన క్రమంలో నమోదు చేయాలనీ అన్నారు. ప్రతి అర్జీదారునికి రశీదును అందజేయాలని అన్నారు. మండల ప్రత్యేక అధికారులు వారి పరిధిలోని అధికారులతో టెలి కాన్ఫరెన్స్ లు ఏర్పాటు చేసుకొని ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందించాలని సూచించారు. జిల్లా అటవీ అధికారి రాజశేఖర్ మాట్లాడుతూ, క్లెయిమ్ ఫారాలు వస్తున్నప్పటికీ భూములకు సంబంధించిన సమాచారం నమోదు కావడం లేదని సంబంధిత తహసీల్దార్లు పరిశీలించాలని సూచించారు. ఈ టెలి కాన్ఫరెన్స్ ఆర్డీఓ రాజేశ్వర్, తహసీల్దార్లు, అటవీ అధికారులు, ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.

Share This Post