DPRO ADB-ఇంటర్మీడియేట్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా, సమన్వయంతో నిర్వహించాలి- స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.

ఇంటర్మీడియేట్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా, సమన్వయంతో నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. మంగళవారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో ఇంటర్మీడియేట్ వార్షిక పరీక్షల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు త్రాగునీరు, మరుగుదొడ్లు సమకూర్చాలని, ప్రాథమిక చికిత్స కు అవసరమైన మందులు, ORS ప్యాకెట్లు, విద్యార్థినిలకు సానిటరీ ప్యాడ్స్ అందుబాటులో ఉంచాలని, ఇతర మౌళిక సదుపాయాలు కల్పించాలని అన్నారు. సౌకర్యవంతంగా పరీక్షా రాసేందుకు సీట్ల సర్దుబాటు చేయాలనీ అన్నారు. అవసరమైన పక్షంలో సమీప పాఠశాలల్లోని ఫర్నిచర్ ను సమకూర్చుకోవాలని సూచించారు. ఇంటర్మీడియేట్ విద్యాశాఖ అధికారుల ఆదేశాలను పాటిస్తూ జిల్లాలో పరీక్షలను సమిష్టి సహకారంతో ఎలాంటి వాటికీ తావివ్వకుండా పరీక్షలను నిర్వహించాలని అన్నారు. గ్రామీణ ప్రాంతంలోని విద్యార్థులు పరీక్ష సమయానికి ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకునే విధంగా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ద్వారా ముందస్తు సమయంలో బస్సులను సమకూర్చాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాలను తెలుసుకునే విధంగా TSBIE m-Service మొబైల్ యాప్ పై అందరికి తెలిసే విధంగా ప్రచారం నిర్వహించాలని అన్నారు. విద్యార్థులు తమ హాల్ టికెట్ లను https:tsbie.cgg.gov.in అనే వెబ్ సైట్ నుండి డౌన్ లోడ్ చేసుకోవాలని ఆయన తెలిపారు. ఈ పరీక్షల నిర్వహణకు ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగకుండా విద్యుత్ శాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని అన్నారు. పరీక్షల కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ విధించడంతో పాటు జిరాక్స్, ఇంటర్నెట్ కేంద్రాలను మూసివేయాలని, ఫ్లైయింగ్ స్క్వాడ్ కొరకు ఇద్దరు డిప్యూటీ తహసీల్దార్లను పంపించాలని జిల్లా రెవెన్యూ అధికారిని ఆదేశించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని స్టోరేజ్ పాయింట్ లకు ప్రశ్నపత్రాలను సరఫరా చేసేందుకు అవసరమైన సెక్యూరిటీని సమకూర్చాలని, ఫ్లైయింగ్ స్క్వాడ్ కొరకు ASI స్థాయి వారిని పంపించాలని అన్నారు. ప్రతి రోజు ఉదయం 6 గంటలకు ప్రశ్నపత్రాల సెట్ నెంబర్ ను తెలియ పరచాలని జిల్లా కమ్యూనికేషన్ అధికారిని ఆదేశించారు. ఇన్విజిలేషన్ విధుల నిర్వహణకు ఉపాధ్యాయులను సమకూర్చాలని, పాఠశాలల్లో పరీక్ష నిర్వహణకు సౌకర్యాలను కల్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పరీక్ష కేంద్రాల చీఫ్ సూపెరింటెండ్ లు జిల్లా రిసెప్షన్ కేంద్రానికి పంపించే జవాబు పత్రాలను సకాలంలో బట్వాడా జరిగే విధంగా సహకరించాలని తపాలా శాఖ అధికారులను ఆదేశించారు.ఇంటర్మీడియేట్ పరీక్షలు మే 6 నుండి 24 వ తేదీ వరకు ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. జిల్లాలో 33 కేంద్రాలలో 19650 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని, ఇందులో 10107 మంది మొదటి సంవత్సరం, 9466 మంది రెండవ సంవత్సరం, 77 మంది బ్యాక్ లాక్ విద్యార్థులు ఉన్నారని తెలిపారు. ఈ పరీక్షల నిర్వహణకు జిల్లా కలెక్టర్ నేతృత్వంలో హై పవర్ కమిటీ, ముగ్గురు సభ్యులతో జిల్లా పరీక్షల కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లా ఇంటర్మీడియేట్ విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్ 08732 – 297115 కు గాని, ఇమెయిల్ ఐడి dieo.adilabad@gmail.com నకు ఏమైనా సమస్యలు ఉంటె తెలియపరచాలని అన్నారు. జిల్లా ఇంటర్మీడియేట్ విద్యాశాఖ అధికారి సి.రవీందర్ మాట్లాడుతూ, ఇంటర్మీడియేట్ వార్షిక పరీక్షల నిర్వహణకు అవసరమైన సహకారం అందించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ శ్రీనివాస్ రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.నరేందర్ రాథోడ్, జిల్లా విద్యాశాఖ అధికారిణి ప్రణీత, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఈ.మాధవరావు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post