DPRO ADB – ఇంటింటి ఆరోగ్య సర్వేతో పాటు వ్యాక్సిన్ పంపిణీ ని పకడ్బందీగా నిర్వహించాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

 

ఇంటింటి ఆరోగ్య సర్వే కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని, సర్వే తో పాటు వ్యాక్సిన్ పంపిణీ వివరాలను సేకరించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం రోజున పట్టణంలోని క్రాంతి నగర్, ఆదిలాబాద్ గ్రామీణ మండలం లోని యాపల్ గూడా లో ఫీవర్ సర్వే, ఉపాధి హామీ పథకం క్రింద చేపట్టిన ఫామ్ పాండ్ ను పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఫీవర్ సర్వే, వాక్సిన్ పంపిణీ వివరాలు ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్ లకు పూర్తి పరిజ్ఞానం కలిగి ఉండాలని అన్నారు. మొదట క్రాంతి నగర్ వ్యాక్సినేషన్ ప్రాసెస్, వ్యాక్సిన్ తీసుకోని వారిని గుర్తించడం, వ్యాక్సిన్ అందించడం వంటి వాటిని మెడికల్ ఆఫీసర్ డా.సోహెల్ ను అడిగి తెలుసుకున్నారు. టీకా పంపిణీ వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేయాలనీ అన్నారు. అనంతరం యాపల్ గూడా లో ఫీవర్ సర్వే, టీకా పంపిణి వివరాలను మెడికల్ ఆఫీసర్ డా.రోజా రాణిని అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని జనాభా, టీకా పంపిణీ, కోవిడ్ ఎక్స్ గ్రేషియా వంటి వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పూర్తి సమాచారం మెడికల్ ఆఫీసర్ తెలుసుకోవాలని, క్షేత్ర పర్యటన చేసి ఇంటింటి వివరాలు తెలుసుకోవలసిన అవసరం ఉందని అన్నారు. కోవిడ్ పాజిటివ్ వ్యక్తులకు మెడికల్ కిట్ లను అందించాలని, వాటిని వాడే విధానం వివరించాలని, ప్రతి రోజు వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకోవాలని అన్నారు. కోవిడ్ వలన మరణించిన వివరాలను సంబంధీకుల ద్వారా తెలుసుకొని, వాటిని నష్ట పరిహారం అందేలా సిఫారసు చేయాలనీ అన్నారు. అంకోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో వంద శాతం వ్యాక్సిన్ జరిగేలా టీమ్ వర్క్ తో పని చేయాలనీ ఆదేశించారు. ఏ ఒక్కరు కూడా వ్యాక్సిన్ తీసుకోకుండా ఉండకూడదని అన్నారు. ఆరోగ్యనికి సంబంధించిన విషయాలను సమీక్షించి వాటిని పరిష్కరించాలని అన్నారు. అర్హత గల వారందరికీ ప్రికాషన్ డోస్ అందించాలని అన్నారు. 15-18 వయసు గల వారందరికీ టీకా అందించాలని, విద్య శాఖ అధికారుల నుండి విద్యార్థుల సమాచారాన్ని తీసుకోవాలని సూచించారు. ఆశ కార్యకర్తలు వారి పరిధిలో ఇంటింటి సర్వే నిర్వహించి జ్వరం, జలుబు, దగ్గు వంటి వివరాలతో పాటు, టీకా తీసుకున్న వారి వివరాలను, ఇంకను తీసుకోకుండా మిగిలి ఉన్న వారి వివరాలు సేకరించాలని అన్నారు. ఈ సందర్బంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ, జ్వరం సర్వే తో పాటు టీకా సర్వే నిర్వహించాలని ఆశ, ANM టీమ్ లకు సూచించారు. డా.రాజారాణి మాట్లాడుతూ, కోవిడ్ లక్షణాలు కలిగిన వారిని గుర్తించి కిట్ లను అందిస్తున్నామని, రోజు వారి ఆరోగ్య వివరాలను తెలుసుకొని వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అంకోలి పీహెచ్ సి పరిధిలో 19 కోవిడ్ మరణాల ఎక్స్ గ్రేషియాకు దరఖాస్తులు రావడం జరిగిందని వాటిలో 10 మంది వివరాలను స్వయంగా తెలుసుకున్నానని, మిగితా వారి వివరాలను ఇతర మార్గాల ద్వారా సేకరించడం జరిగిందన్నారు. రెండవ డోస్ కొరకు 211 మంది పెండింగ్ లో ఉన్నారని, వారందరికీ టీకా పంపిణీ అందిస్తున్నామని తెలిపారు. ప్రికాషన్ డోస్ అర్హత గల వారందరికీ అందిస్తున్నామని అదేవిధంగా 15-18 సంవత్సరాల వయసు గల పిల్లలు 6287 లక్ష్యం కాగా, 3284 మందికి టీకా పంపిణీ ఇవ్వడం జరిగిందని, గ్రామీణ ప్రాంతంలోని పిల్లలందరికీ టీకా అందించామని పట్టణ పరిధిలోని పిల్లలకు టీకా అందించేందుకు విద్య శాఖ అధికారుల నుండి వివరాలు సేకరిస్తున్నామని కలెక్టర్ కు వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.సాధన, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా.శ్రీకాంత్, మున్సిపల్ కమీషనర్ శైలజ, జిల్లా విద్య శాఖ అధికారి ప్రణీత, సర్పంచ్ గంగారాం, ఎంపీడీఓ శివలాల్, ఆశాలు, ANM లు, తదితరులు పాల్గొన్నారు.

అనంతరం యాపల్ గూడా గ్రామంలో గత సంవత్సరం నిర్మించిన ఫామ్ పాండ్ ను కలెక్టర్ పరిశీలించారు. ఉపాధి హామీ కూలీలా సంఖ్యను పెంచాలని, మండలంలో ఉపాధి హామీ పథకం క్రింద చేపడుతున్న పనులపై కలెక్టర్ ఆరా తీశారు. ఉపాధి పనులు నిర్వహిస్తున్న సమయంలో తనకు తెలియ పర్చాలని, ఆ సమయంలో పనులకు సంబంధించిన వాటిని పరిశీలించి యాప్ ద్వారా సమాచారాన్ని అప్ లోడ్ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శివలాల్, సర్పంచ్ గంగారాం, ఎపిఓ, EGS సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Share This Post