DPRO ADB- ఉద్యోగ నియామక పోటీ పరీక్షలకు నిరుద్యోగ యువత సన్నద్ధం కావాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

ఉద్యోగ నియామక పోటీ పరీక్షలకు నిరుద్యోగ యువత సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం రోజున స్థానిక డైట్ కళాశాలలో షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గ్రూప్, తదితర పోటీ పరీక్షలకు రెండు నెలల ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన తో కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, గత నెల 29 న వందమంది ఎస్సీ నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షల ఉచిత శిక్షణకు ఎంపిక చేయడం జరిగిందని, ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకొని మాతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని అన్నారు. ఈ శిక్షణకు నైపుణ్యం గల ఫ్యాకల్టీని ఏర్పాటు చేసి పది అంశాలలో శిక్షణ అందించడం జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో ఎస్సీ, బిసి, పోలీస్, తదితర శాఖల ద్వారా ఉచిత శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుచున్నదని, ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు పోటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరు ఫ్యాకల్టీ చెప్పిన విధంగా ప్రణాళిక బద్దంగా సాధన చేయడం ద్వారా ఉద్యోగం సంపాదించవచ్చని అన్నారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా రెండు నెలల పాటు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం జారీ చేసే ఉద్యోగ నియామకాల పోటీ పరీక్షలతో పాటు ఇతర ఉద్యోగ నియామకాల కోసం కష్టపడి, ఇష్టపడి చదవి విజయం సాధించాలని అన్నారు. కేవలం చదువే కాకుండా ఫిజికల్ కార్యకలాపాలు నిర్వహించాలని సూచించారు. జిల్లా యంత్రాంగం మీ వెంట ఉంటుందని, నైపుణ్యంతో సాధన చేసి విజయావకాశాలు అంది పుచ్చుకోవాలని అన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ, పోటీ పరీక్షలకు అవసరమైన అన్ని అంశాలపై ఫ్యాకల్టీ కోచింగ్ ఇస్తుందని, ప్రతి ఒక్కరు ఈ ఉచిత శిక్షణలో పాల్గొని అవకాశాలను సద్వినియోగ పరుచుకోవాలని అన్నారు. చక్కని ప్రణాళికలతో, రివిజన్ చేస్తూ, ప్రస్తుత పరిణామాలపై ఫోకస్ చేయడంతో పాటు, గత పోటీ పరీక్షలకు సంబందించిన ప్రశ్నావళిని పరిశీలించి అధ్యయనం చేసుకోవాలని సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించే ఉద్యోగ నియామకాల పోటీ పరీక్షాకాలకు సిద్ధం అయి, విజయం సాధించాలని అన్నారు. జిల్లా షెడ్యూల్డు కులాల సంక్షేమ అధికారి సునీత కుమారి మాట్లాడుతూ, ఈ ఉచిత శిక్షణకు వందమంది విద్యార్థులను ఎంపిక చేసి పది సబ్జెక్టు లపై 200 ల సెషన్ లలో నైపుణ్యం కలిగిన ఫ్యాకల్టీతో కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ప్రతి విద్యార్థికి రోజుకు 75 రూపాయల చొప్పున భోజన, ఇతర ఖర్చులకు ఇవ్వడం జరుగుతుందని, స్టడీ మెటీరియల్ సమకూర్చడం జరుగుతుందని తెలిపారు. ఈ శిక్షణను జిల్లాలోని యువత సద్వినియోగ పరచుకొని ఉపాధి అవకాశాలు సంపాదించుకోవాలని కోరారు. ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ రమేష్ స్వాగతోపన్యాసం చేస్తూ విద్యార్థులు భవిష్యత్ ప్రణాళికలకు మైలు రాయి అని, కలెక్టర్, అదనపు కలెక్టర్ మార్గదర్శనం లో విజయం సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ శిక్షణలో పాల్గొన్న పలువురు విద్యార్థులు వారి అభిప్రాయాలు తెలియజేశారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఫ్యాకల్టీలు, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post