DPRO ADB-ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను పకడ్బందీగా నిర్వహించాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. బుదవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో టెట్ పరీక్ష నిర్వహణ, ఏర్పాట్ల పై సంబంధిత అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెల 12న (ఆదివారం) నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష కు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో పేపర్-1 పరీక్ష నిర్వహణకు 33 కేంద్రాలు, పేపర్-2 పరీక్ష నిర్వహణకు 15 కేంద్రాలు ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. పేపర్ – 1 ను ఉదయం గం. 9:30 ని.ల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్ – 2 ను మధ్యాహ్నం గం. 2:30 ని.ల నుండి సాయంత్రము 5 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. నిర్దేశించిన సమయంలోగా అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అన్నారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కు తావివ్వకూడదని, ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్ ఫోన్ లను పరీక్షా హాలులోకి అనుమతించకూడదని అన్నారు. చీప్ సూపరింటెండెంట్ లు, రూట్ ఆఫీసర్ లు టెట్ పరీక్షా మార్గదర్శకాలను తప్పని సరిగా పాటించాలని తెలిపారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్ష పత్రాలను తెరవాలని సూచించారు. ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

అనంతరం మన ఊరు – మన బడి కార్యక్రమం పురోగతిపై విద్య, ఇంజనీరింగ్ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షిస్తూ, జిల్లాలో మొదటి విడతలో ఎంపికైన 237 పాఠశాలల్లో పనులు వేగవంతం చేయాలనీ అన్నారు. 30 లక్షల లోపు ఎస్టిమేట్ ఉన్న పాఠశాలల్లో మరుగుదొడ్లు, త్రాగునీరు, ప్రహరీ గోడ లను అధికారులు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ లు సమన్వయంతో చేపట్టాలని అన్నారు. 30 లక్షల పై ఉన్న పాఠశాలల పనులకు టెండర్ లను ఆహ్వానించి పనులను వేగవంతం చేయాలనీ అన్నారు. ప్రారంభించిన పాఠశాలల పనుల నిర్మాణాలకు సంబందించిన ఫోటోలను సంబంధిత యాప్ లో అప్ లోడ్ చేయాలనీ సూచించారు. ఈ కార్యక్రమం పనులలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం మండలాల వారీగా ఎంపికైన పాఠశాలల పనుల పురోగతికి, తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు

ఈ సమావేశాలలో అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఎన్.నటరాజ్, జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత, జిల్లా పంచాయితీ అధికారి శ్రీనివాస్, పంచాయితీ రాజ్ ఈఈ మహావీర్, బోధనేతర సిబ్బంది, MEO లు, ఇతర ఇంజనీరింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post