DPRO ADB – ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటించాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

శాసన మండలి ఎన్నికల షెడ్యూల్ ప్రకటన మేరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తన నియమావళి, నిర్వహణ, తదితర అంశాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎమ్మెల్సీ ఎన్నికల పై అవగాహన కల్పించడానికి సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆదిలాబాద్ స్థానిక శాసన మండలి సీటు ఖాళీ అవుతున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని అనుసరించి సజావుగా ఎన్నికలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపడుతున్నామని తెలిపారు. ఓటర్ జాబితా, పోలింగ్ కేంద్రాలు, పోలింగ్ నిర్వహణ, సిబ్బంది నియామకం, శిక్షణ కార్యక్రమాలు వంటి కార్యక్రమాలు నిర్వహించవలసి ఉంటుందని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని జడ్పీటీసీ లు, ఎంపీటీసీ లు , మున్సిపల్ కౌన్సిలర్ లు ఓటు హక్కు వినియోగించుకోవలసి ఉంటుందని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అదనపు కలెక్టర్లు సహాయ రిటర్నింగ్ అధికారులుగా ఆ జిల్లాల్లో నియమించడం జరుగుతుందని, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించనున్నారని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో ఉన్న సిబ్బంది, పోలింగ్ ఏజెంట్ లు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, డబుల్ మాస్క్ ధరించాలని అన్నారు. ఎక్కువ మంది గుమిగూడకుండా ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటించాలని అన్నారు. ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించడానికి అనుమతి లేదని అన్నారు. అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్ మాట్లాడుతూ, అనుమతి లేని హోర్డింగ్ లను ఆయా భవనాలపై ఏర్పాటు చేయకూడదని, శాంతి భద్రతలను పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. విడియోగ్రఫీ, ఎంసిఎంసి, ఎంసీసీ కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు మాట్లాడుతూ, ఓటర్ల జాబితాను ముందుగా అందజేయాలని కోరారు. ప్రాంతాలను బట్టి పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలనీ కలెక్టర్ కు సూచించారు. గుర్తింపు కార్డు లను అందజేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సంబంధాల అధికారి ఎన్.భీమ్ కుమార్, మాస్టర్ ట్రైనర్ లక్ష్మణ్, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు నలంద ప్రియా, రాజకీయ పార్టీల ప్రతినిధులు బండి దత్తాత్రి(సిపిఐ-ఎం), ఎస్.ప్రేమ్ కుమార్ (సిపిఐ), ఆకుల రాము (టీడీపీ), పి.ప్రభాకర్(టీడీపీ), ఎండీ.రోహిత్ (AIMIM), షానవాజ్ రహమాన్ (AIMIM), ఏ.అజయ్(తెరాస), డి.రాజు(తెరాస), నాయబ్ తహసీల్దార్లు ప్రవీణ్, సాయి మహేష్, శ్రీవాణి, తదితరులు పాల్గొన్నారు.

Share This Post