DPRO ADB – ఎమ్యెల్సీ ఎన్నికలు పారదర్శకంగా, సమన్వయంతో విజయవంతం చేయాలి- జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్.

ఆదిలాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్యెల్సీ ఎన్నికలు సజావుగా, సమన్వయంతో పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం రోజున కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సహాయ రిటర్నింగ్ అధికారులు, అదనపు కలెక్టర్లతో ఎమ్యెల్సీ ఎన్నికల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, శాసన మండలి ఎన్నిక నిర్వహణపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించడం, డ్రాఫ్ట్ రోల్ అందించడం జరిగిందని తెలిపారు. PWD ఓటర్లను గుర్తించాలని సూచించారు. పోలింగ్ నిర్వహణకు ఓటర్ల సంఖ్యను బట్టి ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బందిని నియమించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా స్థాయి అధికారికి జోనల్ అధికారిగా నియమించాలని, పోలింగ్ సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించాలని అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి టీమ్, వీడియో సర్వేలెన్స్ టీమ్, స్టాటిస్టికల్ సర్వేలెన్స్ టీమ్ లను ఏర్పాటు చేయాలనీ అన్నారు. స్థానిక టీటీడీసీ లో డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కౌంటర్ లను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. బ్యాలెట్ బాక్స్ లను సిద్ధం చేయాలనీ తెలిపారు. రోజువారీ నివేదికలను సమయానుకూలంగా రిటర్నింగ్ అధికారికి సమర్పించాలని అన్నారు. ఎన్నికల నిర్వహణలో ఉండే పోలింగ్, ఇతర సిబ్బంది రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకొని ఉండాలని అన్నారు. ఈ ఎన్నికలను ఎలక్షన్ కమిషన్ నిబంధనలను అనుసరించి నిర్వహించి విజయవంతం చేయాలనీ అన్నారు. ఇతర ఏమైనా సమస్యలు, సలహాలు, సూచనలు ఉన్నట్లయితే సంప్రదించాలని సూచించారు. ఈ సమావేశంలో ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల అదనపు కలెక్టర్లు ఎన్.నటరాజ్, పి.రాంబాబు, డి.మధుసూదన్, బి.రాజేశం, ఆర్డీఓ రాజేశ్వర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఎస్.కిషన్, జడ్పీ సీఈఓ వి.గణపతి, జిల్లా పంచాయితీ అధికారి పి.శ్రీనివాస్, మున్సిపల్ కమీషనర్ ఏ.శైలజ, కలెక్టరేట్ పరిపాలనాధికారి అరవింద్ కుమార్, ఆదిలాబాద్ అర్బన్ ఇంచార్జి తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, కలెక్టరేట్ పర్యవేక్షకురాలు వర్ణ, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు నలంద ప్రియా, నాయబ్ తహసీల్దార్ శ్రీవాణి, మాస్టర్ ట్రైనర్ లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.

Share This Post