ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు. 2021 సంవత్సరంలో 33 కేసులకు గాను 27 కేసులు పెండింగ్ ట్రయల్ లో ఒక కేసు విచారణలో ఉన్నదని, అదేవిధంగా 2022 సంవత్సరంలో ఇప్పటివరకు 18 కేసులకు గాను 7 పెండింగ్ ట్రయల్ లో ఉన్నాయని, మిగితా 11 కేసులు విచారణ స్థాయిలో ఉన్నాయని తెలిపారు. ఇప్పటి వరకు 56 లక్షల రూపాయలు ఉపశమనం క్రింద బాధితులకు పరిహారం అందించడం జరిగిందని తెలిపారు. కేసుల పరిష్కారానికి, బాధితులకు పరిహారం అందేలా తక్షణం చర్యలు సమన్వయంతో తీసుకోవాలన్నారు. పెండింగ్ కేసులను పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలు, బాధితులకు అందిస్తున్న న్యాయసేవలు, పరిహారం పై నివేదికను అందజేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఇప్పటి వరకు నమోదైన ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసులు, బాధితులకు నష్ట పరిహారం చెల్లింపులు తదితర అంశాల పై వివరంగా సమీక్షించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు ఎన్.నటరాజ్, రిజ్వాన్ బాషా షేక్, ITDA ప్రాజెక్టు అధికారి అంకిత్, ఆర్డీఓ రాజేశ్వర్, DSP వెంకటేశ్వర్ రావు, ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనారిటి సంక్షేమ శాఖల అధికారులు సునీత కుమారి, సంధ్యారాణి, రాజలింగం, కృష్ణవేణి, ఎస్సీ కార్పొరేషన్ ఈడి శంకర్, సిఐ సైదారావు, వివిధ శాఖల అధికారులు, కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.