DPRO ADB- కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్

కోవిడ్ వైరస్ వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్యం అందించేందుకు రిమ్స్ లో అన్ని వైద్య చికిత్సలు అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శుక్రవారం రోజున స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తో కలిసి రిమ్స్ ను సందర్శించారు. తొలుత ఆక్సిజన్ ప్లాంట్లను పరిశీలించి వాటి పని తీరును, రికార్డు ల నిర్వహణను పరిశీలించి, ప్లాంట్ లకు నోడల్ అధికారిని నియమించాలని రిమ్స్ డైరెక్టర్ కు సూచించారు. అనంతరం తెలంగాణ డయాగ్నస్టిక్ కేంద్రాన్ని పరిశీలించి వివిధ రకాల పరీక్షలు, యంత్రాలను, సిబ్బంది పని తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం కోవిడ్ ఓపీ, పరీక్షల విధానం, టెస్టుల రిసల్ట్ వివరాలను ఆయా విభాగాల సిబ్బంది నుండి తెలుసుకున్నారు. అనంతరం రిమ్స్ లోని పలు వార్డులలో పర్యటించి రోగులకు అందిస్తున్న చికిత్సలపై వాకబు చేశారు. కోవిడ్ కేంద్రంలో పాజిటివ్ వ్యక్తులకు అందిస్తున్న వైద్య సేవలు, భోజనం, పారిశుద్యం, తదితర విషయాలను రిమ్స్ డైరెక్టర్ ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ, రిమ్స్ లో ఆక్సిజన్, వెంటిలేటర్లు అందుబాటులో ఉంచామని తెలిపారు. జిల్లాలో రోజురోజుకు కోవిడ్ పాజిటివ్ సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని, సామజిక దూరం పాటించాలని, చేతులు శానిటైజ్ చేసుకోవాలని అన్నారు. జిల్లా యంత్రాంగం ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించడం జరుగుతుందని ప్రజలు ఎలాంటి భయాందోళన చెందవద్దని, పాజిటివ్ వచ్చిన వారు హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని సూచించారు. వైద్యులు అందించే కిట్లను ఐదు రోజుల పాటు విధిగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్, డా.అశోక్, రిమ్స్ వైద్యులు, సాంకేతిక సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Share This Post