DPRO ADB -కోవిడ్ నిబంధనల మేరకు గణతంత్ర వేడుకలు నిర్వహించాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను కోవిడ్ నిబంధనలను అనుసరించి, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో గణతంత్ర వేడుకల నిర్వహణపై ముందస్తు సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ఆయా శాఖల అధికారులకు కేటాయించిన విధులను నిర్ణిత గడువులోగా పూర్తిచేయాలని అన్నారు. ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జిల్లాలో సాధించిన ప్రగతికి సంబంధిన సమాచారాన్ని ఆయా శాఖల అధికారుల నుండి పొంది ఈ నెల 20 వ తేదీ నాటికి సందేశాన్ని సిద్ధం చేయాలనీ జిల్లా పౌర సంబంధాల అధికారిని ఆదేశించారు. ఆయా శాఖల అధికారులు 17 లోగా ఆయా శాఖలు చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబదించిన ఒక పేజీ నోట్ జిల్లా పౌర సంబంధాల అధికారికి పంపించాలని అన్నారు. పబ్లిక్ అడ్రెస్స్ సిస్టం, ఫోటో, వీడియో కవరేజీ నిర్వహించాలని అన్నారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో పతాక ఆవిష్కరణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు, మీడియా ప్రతి నిధులకు సీటింగ్ ఏర్పాట్లు చేయాలనీ, ప్రోటోకాల్ విధులు నిర్వహించాలని, వేడుకల నిర్వహణకు సంబంధించిన ఆహ్వాన పత్రాలను తయారు చేయాలనీ ఆదిలాబాద్ పట్టణ తహసీల్దార్ ను ఆదేశించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో పూల డెకరేషన్ స్టేజి పై చేపట్టాలని ఉద్యానవన అధికారికి ఆదేశించారు. కార్యక్రమ నిర్వహణ ప్రాంతంలో పారిశుధ్య కార్యక్రమాలు, సోడియం హైపోక్లోరైడ్ పిచికారీ చేయించాలని, త్రాగు నీటి సౌకర్యం ఏర్పాటు చేయాలనీ మున్సిపల్ అధికారులతో అన్నారు. కోవిడ్ నేపథ్యంలో పరేడ్ గ్రౌండ్ కు వచ్చే వారికీ మాస్క్ లు అందజేయాలని, ప్రాథమిక చికిత్సకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు. శకటాల ప్రదర్శన, ఆస్తుల పంపిణి, ప్రశంస పత్రాల పంపిణీ, తదితర కార్యక్రమాలు ప్రభుత్వ తదుపరి ఆదేశాల ప్రకారం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. అంతకుముందు అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్ మాట్లాడుతూ, గణతంత్ర దినోత్సవం సందర్బంగా ఆయా శాఖల అధికారులు చేపట్టే కార్యక్రమాలను శాఖల వారీగా వివరించారు. అనంతరం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ, జిల్లాలో రెండవ డోస్ వ్యాక్సిన్ తీసుకునే వారు 85 వేల మంది ఉన్నారని, వారికీ ఆయా మండల, మున్సిపల్ వార్డుల ప్రత్యేక అధికారులు వైద్య అధికారుల సహకారంతో వ్యాక్సిన్ పంపిణీ జరిగేలా చూడాలని అన్నారు. పోలీస్, రెవెన్యూ, పంచాయితీ, మున్సిపల్ ఫ్రంట్ లైన్ వర్కర్ లు, సీనియర్ సిటిజెన్స్ బూస్టర్ డోస్, 15-18 వయసుగల పిల్లలకు ఇప్పటివరకు 43 శాతం మందికి వ్యాక్సిన్ అందించడం జరిగిందని తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో ప్రతి ఒక్కరు మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, తరచూ చేతులను శానిటైజ్ చేసుకోవడం వంటి కార్యక్రమాలు నిరంతరం జరిగేలా ప్రత్యేక అధికారులు పర్యవేక్షించాలని అన్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓ రాజేశ్వర్, డిఎస్పీ వెంకటేశ్వర్ రావు, జిల్లా పరిషత్ సీఈఓ గణపతి, జిల్లా గ్రామీణాభివృద్ధి కిషన్, జిల్లా పంచాయితీ అధికారి శ్రీనివాస్, జిల్లా పౌర సంబంధాల అధికారి ఎన్. భీమ్ కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post