DPRO ADB- గడువులోగా దళిత బంధు లబ్ధిదారుల ఎంపికను నిర్వహిస్తాం- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

రాష్ట్ర వ్యాప్తంగా దళితబంధు కార్యక్రమాన్ని ప్రారంభించి దళితుల ఆర్థిక స్థితిగతులను పెంపొందించడానికి రూపొందించడం జరిగిందని రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శనివారం రోజున BRK భవన్ నుంచి జిల్లా కలెక్టర్లతో, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్వహించిన వీడియో కాన్ఫెరెన్ లో కరీంనగర్ నుండి మంత్రి మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ల సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి దళిత బంధు కార్యక్రమం అమలుపై వివరించడం జరిగిందని, దేశంలో గాని, ఏ రాష్ట్రంలో గాని నిర్వహించని బృహత్ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు పరుస్తున్నామని అన్నారు. ప్రతి నియోజక వర్గంలో వంద మంది చొప్పున లబ్దిదారులను ఆయా శాసన సభ్యుల సహకారంతో ఫిబ్రవరి 5 వ తేదీ లోగా ఎంపిక చేయాలనీ, వెనువెంటనే లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలను ప్రారంభించాలని, మంజూరైన యూనిట్ లను మార్చ్ 7 లోగా గ్రౌండింగ్ చేయవలసి ఉందని అన్నారు. ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ అన్నారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ మేడ్చల్ మల్కాజ్ గిరి నుండి మాట్లాడుతూ, దళిత బంధుపై దళితులకు అవగాహన కల్పించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, ఈ పథకం కింద 9.90 లక్షల రూపాయలు లబ్ధిదారుని ఖాతాలో జమ చేయడం జరుగుతుందని, పది వేల రూపాయలు లబ్ధిదారుని రక్షణ నిధిగా ఉంటుందని తెలిపారు. అర్హులైన లబ్ధిదారుని ఆయా నియోజక వర్గ శాసన సభ్యుల సహకారంతో ఫిబ్రవరి 5 లోగా ఎంపిక చేయాలనీ, మార్చ్ 7 వ తేదీ లోగా లబ్ధిదారుడు ఎంపిక చేసుకున్న యూనిట్ లను కలెక్టర్లు గ్రౌండింగ్ చేయాలని అన్నారు. నియోజక వర్గ గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపికకు ప్రత్యేక అధికారులను నియమించాలని కలెక్టర్లను ఆదేశించారు. ముఖ్యమంత్రి కార్యాలయం కార్యదర్శి రాహుల్ బొజ్జ మాట్లాడుతూ, ఒక జిల్లాలో రెండు నియోజక వర్గాల గ్రామాలు, మండలాలు ఉన్నట్లయితే లబ్ధిదారుల ఎంపిక విధానము కు సంబంధించిన విధివిధానాలు త్వరలో పంపిస్తామని తెలిపారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ, జిల్లాలో 30,565 దళిత కుటుంబాలు ఉన్నాయని, ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలకు అనుగుణంగా లబ్ధిదారుల ఎంపికను నియోజక వర్గ శాసన సభ్యులతో సంప్రదించి నిర్వహిస్తామని తెలిపారు. ఫిబ్రవరి 5 లోగా లబ్ధిదారుల ఎంపిక పూర్తీ చేయడం తో పాటు మార్చ్ 7 లోగా యూనిట్ లను గ్రౌండింగ్ చేస్తామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు రిజ్వాన్ బాషా షేక్, ఎన్.నటరాజ్, జడ్పీ సీఈఓ గణపతి, ఎస్సి సంక్షేమ శాఖ అధికారి సునీత, ఎస్సీ కార్పొరేషన్ ఈడి శంకర్, మునిసిపల్ కమీషనర్ శైలజ, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post