DPRO ADB – గడువులోగా నిర్మాణాలు పూర్తీ చేస్తాం- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

మన ఊరు- మన బడి కార్యక్రమం క్రింద నిర్వహించే పనులను నాణ్యతతో చేపట్టాలని, నిర్దేశించిన గడువు లోగా పనులు పూర్తిచేయాలని విద్యాశాఖ కమిషనర్ వాకాటి కరుణ అన్నారు. శుక్రవారం రోజున హైదరాబాద్ నుండి జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఇంజనీరింగ్ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా కమీషనర్ మాట్లాడుతూ, ఈ నెలాఖరు నాటికి జిల్లాల వారిగా నిర్దేశించిన లక్ష్యాల మన ఊరు- మన బడి పనులను పూర్తిచేయాలని అన్నారు. నిర్మాణాలకు సంబందించిన వివరాలను యాప్ లో అప్ లోడ్ చేస్తూ, ఫొటోగ్రాఫ్ లు పంపించాలన్నారు. నిర్మాణాల పనులను ఆయా ఇంజినీరింగ్ AEE లు పరిశీలించి నాణ్యతను పర్యవేక్షించాలని అన్నారు. నిర్మాణాలకు అవసరమైన సిమెంట్, ఇసుక వంటి ముడి సరుకుల కోసం కమిషనర్ కార్యాలయానికి లేఖలు రాయాలని సూచించారు. విద్యుత్ పనులకు సంబంధించి LED బల్బ్ లను వినియోగించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ, జిల్లాలో 237 పాఠశాలల్లో మన ఊరు- మన బడి కార్యక్రమం క్రింద నిర్మాణాలు, మరమ్మతులకు సుమారు 47 కోట్లతో ప్రతిపాదించడం జరిగిందని, ఇప్పటి వరకు 215 పనులకు పరిపాలన ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని తెలిపారు. ఇప్పటివరకు 54 పాఠశాలల్లో పనులు ప్రారంభం అయ్యాయని, జూన్ నెలాఖరు నాటికి 36 పాఠశాలల్లోని పనులు పూర్తిచేస్తామని తెలిపారు. పది శాతం అడ్వాన్స్ ఆయా పాఠశాలల కమిటీలకు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. పాఠశాల యాజమాన్య కమిటీలు, గ్రామస్తులు, శాసన సభ్యులతో పలు దఫా లలో సమావేశాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ పనులపై ప్రతి వారం ఆయా ఇంజనీరింగ్ ఏజెన్సీ లతో సమావేశాలు నిర్వహించడం జరుగుచున్నదని తెలిపారు. ఈ టెలి కాన్ఫరెన్స్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ అధికారి మహావీర్, రోడ్లు భవనాలు శాఖ ఈఈ నర్సయ్య, జిల్లా విద్యాశాఖ అధికారి టి.ప్రణీత, సెక్టోరల్ అధికారి నారాయణ, వివిధ ఇంజినీరింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post