DPRO ADB – గ్రామాల అభివృద్ధిలో గ్రామస్తులు భాగస్వాములు కావాలి – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామాలలో పారిశుద్యం, పచ్చదనం పెంపొందించేలా ప్రణాళికలు రూపొందించి పనులు చేపట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం రోజున గుడిహత్నూర్ మండలం కమలాపూర్ గ్రామంలో ఐదవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో బోథ్ శాసన సభ్యులతో కలిసి ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామాలు పరిశుభ్రత, పచ్చదనంతో వెల్లి విరియాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో ప్రణాళికలు రూపొందించుకొని ఆ దిశగా అభివృద్ధి పనులు చేపట్టాలని అన్నారు. గ్రామాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలలో శానిటేషన్ కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. పల్లె ప్రగతిలో గ్రీన్ యాక్షన్ ప్లాన్ తయారు చేయాలనీ అన్నారు. గ్రామాలలో శానిటేషన్ కార్యక్రమాలను ఉదయం పూట పంచాయితీ కార్యదర్శి, సర్పంచ్ లు పర్యవేక్షించాలని అన్నారు. ప్రతి నర్సరీలో 11 వేల మొక్కలను పెంచాలని, ఇంటింటి తడి, పొడి చెత్తను సేకరించి సేగ్రిగేషన్ షెడ్ కు తరలించి ఎరువును తయారు చేయాలనీ అన్నారు. ప్రతి ఇంటి ముందు మొక్కలను నాటాలని ప్రభుత్వ ప్రైవేట్ ఖాళీ స్థలాల్లో ఎక్కువగా మొక్కలు నాటి సంరక్షించాలని అన్నారు. సీజనల్ వ్యాధులు ప్రభల కుండా నాలీలను శుభ్రపరచాలని, వాటర్ ట్యాంక్ లను క్లోరినేషన్ చేయాలనీ అన్నారు. శానిటేషన్ పై గ్రామాల వారికీ ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలని, ప్రతి ఇంట్లో మరుగుదొడ్లు నిర్మించుకొని వినియోగించుకోవాలని అన్నారు. బడి బాట కార్యక్రమం క్రింద బడి బయట ఉన్న పిల్లలందరిని పాఠశాలలో చేర్పించాలని అన్నారు. మన ఊరు- మన బడి కార్యక్రమం క్రింద అవసరమైన పనులు దశల వారిగా చేపట్టడం జరుగుచున్నదని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసి సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు. అందరి సహకారంతో పల్లె ప్రగతి విజయవంతం చేసి కమలాపూర్ గ్రామాన్ని అభివృద్ధి బాటలో మంచి ర్యాంక్ సంపాదించుకోవాలని అన్నారు. బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపు రావు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశ పెట్టి అమలు పరుస్తున్నామని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలోని ప్రజలు అధికారులపై ప్రేమానురాగాలు కనబరుస్తారని తెలిపారు. పేద వర్గాల కుటుంబాల అవవసరాలను తీర్చడమే అభివృద్ధి అని ఆయన అభివర్ణించారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, దళిత బంధు, నిరంతర విద్యుత్ సరఫరా వంటి కార్యక్రమాలను రాష్ట్రము లో అమలు పరుస్తున్నామని అన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రతి నెల నిధులను నేరుగా గ్రామపంచాయితీలకు కేటాయించడం ద్వారా గ్రామాలు అభివృద్ధి బాటలో ముందుంటున్నాయని అన్నారు. గ్రామాలలో రైతు వేదిక, స్మశాన వాటికలు, క్రీడా ప్రాంగణాలు, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు వంటి అనేక పనులు నిర్వహిస్తూ గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. పవిత్ర గోదావరి జలాలను ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా సరఫరా చేయడం జరుగుతున్నదని తెలిపారు. జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్ మాట్లాడుతూ, గ్రామాలలో శానిటేషన్, పచ్చదనం, పిల్లలకు, గర్భిణీలకు, బాలింతలకు పౌష్టికాహారం అందించడం, మరుగుదొడ్ల వినియోగం వంటి కార్యక్రమాలపై మహిళా సంఘాలు ప్రతి సమావేశంలో చర్చించి గ్రామాభివృద్ధికి సహకరించాలని, ముక్రా-కే గ్రామాన్ని ఆదర్శం గా తీసుకొని ప్రతి గ్రామం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని కోరారు. మొదట గ్రామానికి వచ్చిన కలెక్టర్, ఎమ్యెల్యేలకు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమ అనంతరం కలెక్టర్, ఎమ్యెల్యేలను శాలువ లు, పుష్ప గుచ్చాలతో సత్కరించారు. అంతకుముందు తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు పల్లె ప్రగతిపై పాటల రూపంలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో RWS ఎస్.ఈ. వెంకటేశ్వర్లు, విద్యుత్ శాఖ ఎస్.ఈ. ఉత్తమ్, సర్పంచ్ ప్రేమలత, ఎంపీటీసీ కృష్ణవేణి, తహసీల్దార్ సంధ్యారాణి, ఎంపీడీఓ సునీత, పంచాయితీ కార్యదర్శి, అధికారులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post