DPRO ADB-జిల్లాలో పొగాకు ఉత్పత్తులు, వాడకం నియంత్రణకు చర్యలు చేపట్టాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

జిల్లాలో పొగాకు ఉత్పత్తులు, వాడకం నియంత్రణకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా పొగాకు నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం రూపొందించిన చట్టం ప్రకారం జిల్లాలో పొగాకు ఉత్పత్తులు, వాడకాన్ని నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. బహిరంగ ప్రదేశాలలో పొగ త్రాగడం నేరమని, నిబంధనలు అతిక్రమించిన వారిపై అపరాధ రుసుము విధించాలని ఆదేశించారు. పొగాకు ఉత్పత్తులపై ప్రచారం, విద్యాసంస్థలకు 100 గజాల లోపు పొగ త్రాగడం, ఉత్పత్తులను అమ్మడం నిషేదించాలని అన్నారు. 18 సంవత్సరాల లోపు పిల్లలకు పొగాకు ఉత్పత్తులను అమ్మరాదని అన్నారు. గ్రామస్థాయిలో సర్పంచ్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఆశా, అంగన్వాడీ, గ్రామపెద్దల సమక్షంలో పొగాకు నియంత్రణ కమిటీని ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని అన్నారు. పొగాకు వాడకం వలన ఆర్థికంగా నష్టపోవడం, గుట్కా, దూమపానం సేవించడం వలన ఆనారోగ్యం బారిన పడతారని తెలిపారు. పట్టణ ప్రధాన కూడళ్లు, రైతుబజార్, ఆసుపత్రులు, రైల్వే స్టేషన్ లు, బస్ స్టేషన్ లలో గుట్కా సేవించడం, పొగ త్రాగడం వంటివి అరికట్టాలని, పరిసరాల పరిశుభ్రతను కాపాడుకునేందుకు అధికార యంత్రాంగం కఠిన చర్యలు చేపట్టాలన్నారు.
మారుమూల గ్రామాలతో పాటు, పట్టణ ప్రాంతాలలో పొగాకు, గుట్కా వాడకం వలన కలిగే అనర్దాలపై ప్రజలకు తెలంగాణ సాంస్కృతిక సారథి కళా బృందాల చే అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. వైద్య ఆరోగ్య, పోలీస్, సంబంధిత శాఖలు సమన్వయంతో పొగాకు నియంత్రణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశం లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, డిఎస్పీ వెంకటేశ్వర్ రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.నరేందర్ రాథోడ్, జిల్లా పొగాకు నియంత్రణ అధికారి శ్రీకాంత్, జిల్లా పంచాయితీ అధికారి శ్రీనివాస్, జిల్లా విద్యాశాఖ అధికారిణి ప్రణీత, మున్సిపల్ ఈఈ వెంకట శేషయ్య, వైద్యాధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post