DPRO ADB – జిల్లాలో మలేరియా, డెంగ్యూ వ్యాధులు ప్రబలకుండా సమన్వయంతో పనిచేయాలి -జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

జిల్లాలో మలేరియా, డెంగ్యూ వ్యాధులు ప్రబలకుండా శాఖల సమన్వయంతో పనిచేసి జీరో కి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం రోజున జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కీటకాజానిత వ్యాధుల నియంత్రణ పై మెడికల్ ఆఫీసర్లు, సూపర్ వైజర్లకు ఒరియెంటెషన్ కార్యక్రమాన్ని కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.  ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, గత ఏడేనిమిది సంవత్సరాల క్రితం జిల్లాలో మలేరియా, డెంగ్యూ కేసులతో ఇబ్బందులు ఉండేవని, ప్రస్తుతం ముందస్తు ప్రణాళికలతో వ్యాధులు, జ్వరాలు ప్రబలకుండా ఉండేందుకు గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ప్రజా ప్రతినిధుల సహకారం, అధికారులు ముందస్తు చర్యల వలన మలేరియా, డెంగ్యూ వలన మరణాలు జరగలేదని తెలిపారు. ప్రస్తుతం పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు జరుగుతున్నా యని, అట్టి కార్యక్రమాలలో శానిటేషన్ పై ప్రజలకు వివరిస్తూ, వచ్చే వర్షాకాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై వివరించడం జరుగుతున్నదని తెలిపారు. ఏప్రిల్ మాసంలో ఇండర్వెళ్లి పరిధిలో జ్వరాలు రావడం, వెంటనే వైద్య, పంచాయతీ సిబ్బంది అప్రమత్తం అయి చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. వచ్చే వర్షాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు పర్యవేక్షణ చేయాలని అన్నారు. జోనల్ మలేరియా అధికారి డా.సునీల్ మాట్లాడుతూ, ఆదిలాబాద్ జిల్లా అంటే గతంలో జ్వరాలు ఉండేవని, కానీ ప్రస్తుతం జిల్లా అధికార యంత్రాంగం సమిష్టి చర్యలు, జిల్లా కలెక్టర్ మార్గదర్శనంలో ఎలాంటి మరణాలు సంభవించలేదని, ప్రజాప్రతినిధుల సహకారం తో ముందస్తు చర్యలు తీసుకోవడం, అధికారులు, వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది పనులతో జిల్లాతో జిల్లాలో కేసులు ఒకటి లోపు ఉన్నాయని, ఈ సంవత్సరం లో జిల్లాలో ఒక్క కేసు కూడా రాకుండా సిబ్బంది పనిచేయాలని అన్నారు. ఈ సమావేశంలో  ఎంట్రమాలోజిస్ట్ నాగయ్య, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. నరేందర్ రాథోడ్, డిప్యూటీ DMHO  డా. సాధన, DMO డా.శ్రీధర్, వైద్యులు, మెడికల్ ఆఫీసర్లు, సూపర్ వైజర్లు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post