DPRO ADB – జిల్లాలో వందశాతం వ్యాక్సినేషన్ జరగాలి- ఆదిలాబాద్ ఎమ్యెల్యే జోగు రామన్న: పండుగల వేళ ప్రతి ఒక్కరు కోవిడ్ నిబంధనలు పాటించాలి- జడ్పి చైర్మన్ రాథోడ్ జనార్దన్: ప్రజలు సమూహాలుగా ఉండకుండా చూడాలి, కోవిడ్ నిబంధనలు పాటించాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

సమాజ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని, కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆదిలాబాద్ శాసన సభ్యులు జోగు రామన్న అన్నారు. గురువారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎమ్యెల్యే అధ్యక్షతన జరిగిన కోవిడ్ వైరస్ వ్యాప్తి, నిరోధక చర్యలు, వ్యాక్సినేషన్, తదితర అంశాలపై కోవిడ్ మూడవ విడత ఓమిక్రాన్ ప్రపంచ వ్యాప్తంగా వేగంగా వ్యాప్తి జరుగుతున్న దృష్ట్యా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ముందస్తు ఏర్పాట్లపై ఆయన వైద్యం, పంచాయితీ, మున్సిపల్, తదితర శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో మొదటి డోస్ వ్యాక్సిన్ 98 శాతం, రెండవ విడత 68.5 శాతం అందించడం జరిగిందని, 15-18 సంవత్సరాల వయసు గల పిల్లలకు వ్యాక్సిన్ అందించడం, 60 ఏండ్లు పైబడిన వారికీ, ఫ్రంట్ లైన్ వర్కర్ లకు ఇప్పటివరకు 2843 మందికి బూస్టర్ డోస్ అందించారని, రానున్న మూడు రోజుల్లోగా యుద్ధ ప్రాతిపదికన అర్హతగల వారందరికీ అందించాలని అన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 82 వేల మందికి రెండవ డోస్ అందించవలసి ఉందని, వారందరిని గుర్తించి, టీకా పంపిణి టీమ్ లను ఆయా ప్రాంతాలకు పంపించి అందించాలని సూచించారు. వైరస్ బారిన పడకుండా ముందస్తు చర్యల్లో భాగంగా విస్తృత ప్రచార కార్యక్రమాలు ప్రసారమాధ్యమాలు, టామ్ టామ్ ల ద్వారా నిర్వహించాలని సూచించారు. సర్పంచ్ లు వారి గ్రామాల్లో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలకు అవగాహన కల్పించి కోవిడ్ నిబంధనలు పాటించేలా చూడాలని అన్నారు. ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకొని వారికీ ఇప్పించాలని అన్నారు. రిమ్స్ ఆసుపత్రిలో వైద్యులు, వైద్య సిబ్బందిని, ఆక్సిజన్ బెడ్, ఆక్సిజన్ వెంటిలేటర్ లను అందుబాటులో ఉంచాలని, ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలనీ రిమ్స్ డైరెక్టర్ కు సూచించారు. జిల్లాలో రెమిడీసీవర్ ఇంజెక్షన్ అందుబాటులో ఉండే విధంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ ను ఆదేశించారు. కోవిడ్ RTPCR, ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించాలని అన్నారు. ముఖ్యంగా వైన్స్, బార్ షాప్ లు, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్ లతో పాటు ప్రతి దుకాణం ముందు శానిటైజర్ లను ఏర్పాట్లు చేయాలనీ, కొనుగోలు దారు తప్పనిసరిగా మాస్క్ ధరించే విధంగా బోర్డు లు ఏర్పాట్లు చేయాలనీ, భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేయాలనీ అన్నారు. శివాజీ చౌక్, నేతాజీ చౌక్ వంటి ప్రాంతాల్లో మహారాష్ట్ర నుండి కూలీలు ఎక్కువగా ఉదయం కనిపించడం జరుగుతుందని, ఏ ఒక్కరు కూడా మాస్క్ ధరించడం లేదని వారందరు మాస్క్ లు ధరించే విధంగా రైల్వే, బస్ స్టేషన్ లలో ముందస్తుగా తెలియ జేయాలని అన్నారు. పట్టణంలో వివిధ హోటల్ లలో చేతులకు గ్లౌజ్ లు లేకుండానే తిను బండారాలు సరఫరా చేస్తున్నారని వాటిని నియంత్రించే విధంగా మునిసిపల్ అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. స్వచ్చంద సంస్థలు మాస్క్ లు పంపిణి కార్యక్రమాన్ని చేపట్టాలని, జోగు ఫౌండేషన్ ద్వారా మాస్క్ లను పంపిణి చేస్తామని తెలిపారు. సీనియర్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించి వైరస్ వ్యాప్తిని అరికట్టే కార్యక్రమాలు, పర్యవేక్షణ అదేవిధంగా వ్యాక్సినేషన్ ప్రతి ఒక్కరికి ఇప్పించేలా చూడాలని అన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్ మాట్లాడుతూ, కరోనా నిబంధనలు ప్రతి ఒక్కరు పాటించాలని, జాగ్రత్తలు తీసుకోవాలని, వ్యాక్సిన్ తీసుకోవాలని అన్నారు. సంక్రాతి పండుగ సందర్బంగా మహిళలు కలిసి మెలసి పండుగ చేసుకోవడం జరుగుతుందని, అలా గుమిగూడకుండా కోవిడ్ నిబంధనలు పాటించే విధంగా వివరించాలని సూచించారు. కరోనా నియంత్రణలో తమ సహకారం అందిస్తామని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ, జిల్లాలో మొదటి డోస్ 99 శాతం మందికి అందించామని, రెండవ డోస్ పంపిణీకి టీమ్ లు ఆయా ప్రాంతాల్లో ఇంటింటికి అందిస్తున్నారని తెలిపారు. 15-18 సంవత్సరాల పిల్లలకు టీకా పంపిణి కార్యక్రమం జరుగుచున్నదని, సీనియర్ సిటిజెన్ లకు, ఫ్రంట్ లైన్ వర్కర్ లకు బూస్టర్ డోస్ అందిస్తున్నామని తెలిపారు. జిల్లాలో ప్రజలు సమూహాలుగా ఏర్పడకుండా అవగాహన కల్పించడం, మాస్క్ లు ధరించడం, భౌతిక దూరం పాటించడం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం వంటి వాటిపై విస్తృత ప్రచారం నిర్వహించాలని అన్నారు. మున్సిపల్, పోలీస్ అధికారులు పట్టణంలో పర్యటించి కోవిడ్ నిబంధనలు పాటించని వారి నుండి ఫైన్ వసూలు చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లా సరిహద్దున మహారాష్ట్రను అనుకోని ఉన్న ఏడు మండలాల్లోని సర్పంచ్ లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి కరోనా వ్యాప్తి అరికట్టడానికి తీసుకోవలసిన ఏర్పాట్లను వివరించాలని జిల్లా పంచాయితీ అధికారిని ఆదేశించారు. అదేవిధంగా రెండవ డోస్ వ్యాక్సిన్, బూస్టర్ డోస్ తీసుకునే విధంగా గ్రామాల్లో అవగాహన కల్పించాలని అన్నారు. రిమ్స్ ఆసుపత్రిలో 550 ఆక్సిజన్, వెంటిలేటర్ బెడ్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, 220 పిడియాట్రిక్ బెడ్స్, 150 ఆక్సిజెన్ తో కలిగియున్న పిడియాట్రిక్ బెడ్స్, 70 వెంటిలేటర్ కలిగివున్న పిడియాట్రిక్ బెడ్స్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతానికి రిమ్స్ లో 13 పాజిటివ్ కేసులు ఉన్నాయని తెలిపారు. గత రెండు దశల్లో వచ్చిన కరోనా వైరస్ ను దృష్టిలో ఉంచుకొని జిల్లా యంత్రాంగం అందుబాటులో ఉండి ప్రజలకు సేవలందించాలని అన్నారు. జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, కరోనా వలన ప్రజల్లో మార్పు రావలసిన అవసరం ఉందని అన్నారు. కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో కరోనా నిబంధనలు పాటించని వారి నుండి అపరాధ రుసుము వసూలు చేస్తున్నామని, కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు. రాత్రి 10 గంటల తరువాత పోలీస్ సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. మహారాష్ట్ర నుండి అక్రమ మద్యం సరఫరా కాకుండా నియంత్రణ చర్యలు చేపడుతున్నామని అన్నారు. ఇప్పటివరకు నాలుగు చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పోలీస్ శాఖలో ఇప్పటివరకు 400 మంది సిబ్బంది బూస్టర్ డోస్ తీసుకున్నారని తెలిపారు. రిమ్స్ డైరెక్టర్ డా.జయ సింగ్ రాథోడ్ మాట్లాడుతూ, కరోనా వలన ఏ ఒక్కరు కూడా మరణించకుండా ముందస్తు ఏర్పాట్లు చేపట్టామని వివరించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ, కోవిడ్ నిబంధనలు ప్రతి ఒక్కరు పాటించాలని, రానున్న మూడు మాసాల కాలం మాస్క్ ధరించడం రక్షణ కవచామని అన్నారు. పట్టణంలో కరోనా నిబంధనలు పాటించడం లేదని మునిసిపల్, పోలీస్ శాఖల సమన్వయంతో ప్రజలను చైతన్య పరచాలని కోరారు. ఈ సమావేశంలో ఆర్డీఓ రాజేశ్వర్, జిల్లా పంచాయితీ అధికారి శ్రీనివాస్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post