DPRO ADB- తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు పటిష్ట చర్యలు – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో తహశీల్దార్లు, ఎంపిడిఓ లు, మండల ప్రత్యేక అధికారులతో తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాలు, ధరణి TM 33, పల్లె ప్రగతి కార్యక్రమాల నిర్వహణ పై సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ముందుగా క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యలపై మండలాల వారీగా సంబంధిత అధికారులతో చర్చించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి ఆవాసానికి క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు స్థలాల గుర్తింపుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో 1176 క్రీడా ప్రాంగణాలకు గాను ఇప్పటి వరకు 660 స్థలాలను గుర్తించడం జరిగిందని, మిగితా వాటికీ త్వరితగతిన స్థలాలను గుర్తించి పనులు ప్రారంభించాలని అన్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా జూన్ 2 న మండలానికి రెండు చొప్పున, పట్టణంలో రెండు క్రీడా ప్రాంగణాలను ప్రారంభించడం జరిగిందన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం నిబంధనల మేరకు యుద్ధ ప్రాతిపదికన స్థలాలను గుర్తించి అంచనాలను సిద్ధం చేసి ఆన్ లైన్ లో పొందుపరచాలని సూచించారు. పట్టణ పరిధిలో 98 క్రీడా ప్రాంగణాలకు గాను ఇప్పటి వరకు 14 స్థలాలను గుర్తించడం జరిగిందని, మిగితా వాటికీ త్వరిత గతిన గుర్తించి చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమీషనర్ ను ఆదేశించారు. ధరణి TM 33, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, తదితర అంశాలపై జిల్లాలోని మీసేవ కేంద్రాల ఆపరేటర్ లకు శిక్షణ ను అందించాలని EDM ను ఆదేశించారు. జిల్లాలో ఈ నెల 3 నుండి నిర్వహిస్తున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలలో పరిసరాల పరిశుభ్రత, పారిశుద్యం, నర్సరీ, విద్యుత్, రోడ్లు, మురికి కాలువల పూడికతీత, తదితర పనులను సమర్థవంతంగా నిర్వహించాలని, పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులు, సిబ్బంది పై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు రిజ్వాన్ బాషా షేక్, ఎన్. నటరాజ్, ఆర్డీఓ రాథోడ్ రమేష్, జడ్పీ సీఈఓ గణపతి, జిల్లా గ్రామీణభివృద్ధి అధికారి కిషన్, మున్సిపల్ కమిషనర్ శైలజా, ఆయా తహశీల్దార్లు, ఎంపిడిఓ లు, ప్రత్యేక అధికారులు, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post