ధరణి పోర్టల్ పై మీ సేవ కేంద్రాల నిర్వాహకులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని అదనపు కలెక్టర్ ఎన్. నటరాజ్ అన్నారు. మంగళవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ధరణి TM 33, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఇతర ధ్రువీకరణ పత్రాల ఆన్ లైన్ విధానం పై మీసేవ కేంద్రాల నిర్వాహకులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ధరణి TM 33, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఇతర ధ్రువీకరణ పత్రాల ఆన్ లైన్ నమోదు లో ఎలాంటి తప్పిదాలు లేకుండా సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ప్రభుత్వానికి, అధికారులకు అనుసంధానంగా ఉండే మీ సేవ కేంద్రాల నిర్వాహకులు, అవసరమైన ధ్రువీకరణ పత్రాలు, ఆధారాలను క్షున్నంగా పరిశీలించి ఆన్ లైన్ లో నమోదు చేయాలనీ అన్నారు. ధరణి పోర్టల్ TM 33 మాడ్యూల్ లో పేరు, భూమి స్వభావం, వర్గీకరణ, రకం, విస్తీర్ణం, సర్వే, సబ్ డివిజన్ నంబర్, నాలా, వ్యవసాయ, పట్టా, అసైన్డ్, తదితర ఆప్షన్ లు ఉన్నాయని, అవసరమైన, సరైన ఆధారాలు కలిగిన పత్రాలను పొందు పరచాలన్నారు. అలాగే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కుల ధ్రువీకరణ పత్రాల నమోదులో తప్పులు ఉంటున్నాయని, వాటిని సరిచేసుకోవాలని అన్నారు. వివరాలను ఆన్ లైన్ లో తప్పుగా నమోదు చేయడం వలన ప్రజలు సంబంధిత కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని, వారి సమయం, ఖర్చు వృధా అవుతుందని, పత్రాల నమోదులో ఏమైనా సందేహాలు ఉంటె సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు. నిర్వాహకులు అధికంగా రుసుము వసూలు చేస్తున్నారని, రైతులు, ప్రజల నుండి ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన రుసుములనే తీసుకోవాలని, నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్బంగా ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ రాథోడ్ రమేష్, ధరణి పర్యవేక్షకురాలు స్వాతి, EDM రవి, తహసీల్దార్లు, ధరణి కో-ఆర్డినేటర్లు, మీ సేవ కేంద్రాల నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.