DPRO ADB – నర్సరీలలోని మొక్కలను సంరక్షించాలి- అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలకు, గర్భిణీలకు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలి- స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.

నర్సరీలలో మొక్కల ఎదుగుదలకు చర్యలు తీసుకోవాలని పంచాయితీ కార్యదర్శులను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. బుధవారం రోజున ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని చిచ్ ధరి, ఖానాపూర్, అల్లి కొరి గ్రామాలలో ఆయన పర్యటించారు. అల్లికొరి గ్రామం నుండి ఎండలో అటవీ ప్రాంతంలో కాలినడకన అదనపు కలెక్టర్ వెళ్లి నర్సరీలను పరిశీలించారు. నర్సరీలలో మొక్కలు ఎదుగుదల లేకపోవడం, మొక్కలకు నీడ కల్పించక పోవడంతో పంచాయితీ కార్యదర్శులను హెచ్చరించారు. హరితహారం కార్యక్రమానికి అవసరమైన మొక్కలను పెంచాలని పలు సమావేశాల్లో పంచాయితీ కార్యదర్శులకు తెలియజేయడం జరిగిందని, అలాగే మొక్కలకు వేడిమి నుండి సంరక్షించేందుకు షెడ్ నెట్ లను ఏర్పాటు చేయాలనీ చెప్పడం జరిగిందని అయినప్పటికీ ఏర్పాట్లు చేపట్టాక పోవడంతో కార్యదర్శులను మందలించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి పిల్లల బరువు, ఎత్తులను పరిశీలించారు. పిల్లల ఎదుగుదలకు పౌష్టికాహారం అందించాలని, గర్భిణీలకు, బాలింతలకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని అన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో నిర్వహిస్తున్న పలు రకాల రిజిస్టర్ లను ఆయన పరిశీలించారు. ప్రతి బుధవారం అంగన్వాడీ కేంద్రాలలో సమావేశాలను నిర్వహించాలని పిల్లల ఎదుగుదలపై పోషకులకు వివరించాలని అంగన్వాడీ కార్యకర్తలకు సూచించారు. ఈ పర్యటనలో అదనపు కలెక్టర్ వెంట ఎంపీడీఓ శివలాల్, సర్పంచులు, పంచాయితీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post