DPRO ADB- పచ్చదనం, పారిశుధ్య కార్యక్రమాలను నిరంతరం కొనసాగించాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

పచ్చదనం, పారిశుధ్య కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం రోజున ఇచ్చోడ మండలం దుబార్ పేట్, మాదాపూర్ గ్రామపంచాయితీలలో పర్యటించి ఐదవ విడత పల్లె ప్రగతి కార్యక్రమాలలో కలెక్టర్ పాల్గొన్నారు. తొలుత దుబార్ పేట్ క్రీడా ప్రాంగణాన్ని సందర్శించి ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు, అనంతరం పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించి మరిన్ని మొక్కలను నాటి చిట్టడివి లాగా వనాన్ని తయారు చేయాలనీ సర్పంచ్ కు సూచించారు. దుబార్ పేట్ లో అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి పిల్లలకు, గర్భిణీలకు, బాలింతలకు అందిస్తున్న పౌష్టికాహారం, సామ్-మామ్ పిల్లలను గుర్తించి వారికి అందిస్తున్న బాలామృతం ప్లస్ వివరాలను అంగన్వాడీ టీచర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆత్రం కీర్తన కు కలెక్టర్ అక్షరాభ్యాసం చేయించారు. గ్రామంలోని నర్సరీని సందర్శించి ఎక్కువ మొక్కలను పెంచాలని సర్పంచ్, పంచాయితీ కార్యదర్శిని ఆదేశించారు. అదేవిధంగా మొక్కలకు సంబందించిన వివరాలను రిజిస్టర్ లో నమోదు చేయాలనీ, ఎలాంటి మొక్కలు పెంచుతున్నారో మొక్కల పేర్లతో బోర్డు లను ఏర్పాటు చేయాలనీ అన్నారు. దుబార్ పేట్ హామ్లెట్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని, గ్రామాన్ని సుందరంగా తీర్చి దిద్దుకోవాలని, పారిశుధ్య కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగించాలని అన్నారు. వచ్చే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రభల కుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అన్నారు. జిల్లాలో ప్లాస్టిక్ నిషేధించడం జరిగిందని వాటి స్థానంలో పేపర్, సంచులు వంటివి వినియోగించుకోవాలని సూచించారు. గ్రామ సమస్యలలో భాగంగా రహదారులపై నాలుగు కల్వర్టుల నిర్మాణాలకు అవసరమైన ఎస్టిమేట్ సిద్ధం చేసి ప్రతిపాదించాలని పంచాయితీ రాజ్ ఏఈ ని ఆదేశించారు. విద్యుత్ సరఫరాకు అవసరమైన స్తంభాలను ఏర్పాటు చేస్తామని, వదులుగా ఉన్న వైర్లను సరి చేయిస్తామని తెలిపారు. అనంతరం మాదాపూర్ గ్రామపంచాయితీ లోని పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించారు. ఆ తరువాత గ్రామంలో ఏర్పాటు చేసిన కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ, గ్రామంలో క్రీడా ప్రాంగణానికి అవసరమైన భూమిని సేకరించాలని అన్నారు. యువతకు, పిల్లలకు ఆటవిడుపు కు క్రీడా ప్రాంగణాలు ఉపయోగపడతాయని, ఖో ఖో, కబడ్డీ, వాలి బాల్ వంటి ఆటలు వాడుకోవచ్చని అన్నారు. పారిశుధ్య నిర్వహణలో భాగంగా ఇంటింటి చెత్త సేకరణ చేసి సేగ్రిగేషన్ షెడ్ కు తరలించి ఎరువును తయారుచేయాలని అన్నారు. మన ఊరు- మన బడి కార్యక్రమం క్రింద రానున్న మూడు సంవత్సరాలలో అన్ని ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక సదుపాయాలు కల్పించడం, మరమ్మతులు చేపట్టడం జరుగుతుందన్నారు. హరితహారం కార్యక్రమంలో వీలైనన్ని మొక్కలను నాటి పచ్చదనం సంతరించుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. మరుగుదొడ్లను నిర్మించుకున్న వారు తప్పని సరిగా వినియోగంలో ఉంచుకోవాలని, ఇంకను మరుగుదొడ్లు అవసరమైన వారు పంచాయితీ కార్యదర్శికి దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమాలలో ఎంపీపీ ప్రీతం రెడ్డి, జిల్లా పంచాయితీ అధికారి శ్రీనివాస్, విద్యుత్ శాఖ ఎస్.ఈ. ఉత్తమ్ జాడే, RWS ఎస్.ఈ.వెంకటేశ్వర్లు, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, ఎంపీడీఓ రామ్ ప్రసాద్, తహసీల్దార్ మోహన్ సింగ్, సర్పంచ్ లు ఛహ్కటి రవి, ఖమర్ సుల్తానా, గ్రామస్తులు, ఇతర ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post